ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై సిట్ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు అందించింది. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో రెండు రోజులు పర్యటించిన సిట్ సభ్యులు.. పూర్తిస్థాయిలో పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ సోమవారం డీజీపీకి అందజేశారు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో మొత్తం 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. కాగా.. ఎన్నికల హింసకు సంబంధించిన ఈ నివేదికను సీఈసీ, ఎన్నికల సంఘం సీఈఓకి కూడా పంపించారు. 150 పేజీల ప్రాథమిక నివేదికను ECI కి సీఎస్ జవహర్ రెడ్డి పంపించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
కొన్ని FIRలలో అదనపు సెక్షన్లు చేర్చాలని సిట్ బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరికొందరిపై కేసులు నమోదు చేయాలని సిట్ బృందం సూచించినట్లు సమాచారం.. కొందరు అధికారులు, నాయకుల పాత్రపై పక్కా ఆధారాలు సేకరించి.. పూర్తి సమాచారాన్ని అందించినట్లు తెలుస్తోంది. అయితే.. కొందరు అధికారులు హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసి కూడా ఆలస్యంగా వెళ్లారని.. స్థానిక రాజకీయ నేతలతో వారంతా మిలాఖత్ అయ్యారని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం..
ఎన్నికల హింసపై ఆయా ప్రాంతాల్లోని అధికారులతో కూడా సిట్ బృందం భేటీ అయింది.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిందెవరు? నిందితులందరినీ అరెస్ట్ చేశారా? లేదా? ఆ రోజు డ్యూటీలో ఉన్న పోలీసులనూ ప్రశ్నించింది సిట్ టీమ్.
ఇక సిట్ చీఫ్ బ్రిజ్‌లాల్‌ను వైసీపీ నేతల బృందం కలిసింది. ఈ బృందంలో జోగిరమేష్, అంబటి, పేర్నినాని, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మల్లాది విష్ణు ఉన్నారు. ఏపీలో జరిగిన అల్లర్లపై సిట్ చీఫ్‌కు వైసీపీ బృందం ఫిర్యాదు చేసింది.
ఇదిలాఉంటే.. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సస్పెండయిన అధికారుల స్థానంలో కొత్తవారిని నియమించారు. ఐదుగురు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలను నియమించినట్లు పోలీస్ శాఖ వెల్లడించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..