
పార్వతీపురం మన్యం జిల్లాలో వలస పక్షుల రాకతో స్థానికులు ఘనంగా పండుగ జరిపారు. సీతానగరం మండలం చెల్లంనాయుడువలసలో రుతుపవనాల రాకను సూచించే సైబీరియా వలస పక్షులు సందడి చేస్తున్నాయి. ఈ పక్షులు ప్రతి ఏటా జూన్ రెండో వారంలో గ్రామానికి వచ్చి డిసెంబరులో తమ స్వదేశమైన సైబీరియాకు తిరిగి వెళతాయి. గ్రామ పరిసరాల్లోని చింత చెట్లపై స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఆరు నెలల పాటు గ్రామస్థులకు కనువిందు చేస్తాయి. ఈ పక్షుల రాకతో వర్షాలు కురుస్తాయన్న నమ్మకం స్థానికుల్లో బలంగా ఉంది. గత రెండు రోజులుగా గుంపులు గుంపులుగా వచ్చి వలస పక్షులు చెట్ల పై స్థిరపడ్డాయి. గ్రామస్తులు నమ్మినట్లే పక్షులు రాగానే వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి.
సైబీరియా నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన ఈ పక్షులు చింత చెట్ల గుండీలను గూడుగా మలచుకుని తమ కిలకిల శబ్దాలతో పరిసరాలను ఉల్లాసంగా మార్చాయి. స్థానికులు ఈ పక్షులను రుతుపవన దూతలుగా భావిస్తారు. గ్రామంలోని పిల్లలు, వృద్ధులు ఈ అతిథులను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ పక్షుల రాకతో వర్షాకాలం ఆసన్నమైందని పంటలు సమృద్ధిగా పండుతాయని రైతులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగుతోంది. పక్షుల రాకను గ్రామస్థులు ఒక పండుగలా జరుపుతున్నారు. పర్యావరణ సమతుల్యతలో ఈ వలస పక్షుల పాత్ర కీలకమనే అభిప్రాయంతో ఈ పక్షుల సంరక్షణకు స్థానికులు నడుం బిగిస్తారు. పక్షులకు హాని కలగకుండా చూడటంతో పాటు చెట్లను కాపాడటం, పక్షులకు ఆటంకం కలగకుండా చూడటం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సైబీరియా పక్షులు కేవలం వలస పక్షులు మాత్రమే కాదు, తమ జీవన విధానంలో ఒక పాత్రగా మారిపోయాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..