Oil Prices: ఏ దేశంలో విపత్తు వచ్చినా.. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా మనం వినియోగించే నిత్యావసర వస్తువులపైనే భారం పడుతోంది. తాజాగా జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ దేశాల యుద్దం కూడా మన దేశంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దేశంలో నిత్యావసర వస్తువైన నూనె ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటుతున్నాయి. అసలు వంటనూనె ధర మార్కెట్లో ఏ విధంగా ఉందో అనేదానిపై టీవీ 9 ఫ్యాక్ట్ చెక్..
వంట నూనె ప్రతి ఇంట్లో నిత్యావసర సరుకు.. వంట నూనె ధరలు ఆకాశాన్ని అంటడంపై ప్రజలలో ఆందోళన నెలకొంది. మరోవైపు.. పరిస్థితులను క్యాష్ చేసుకుంటూ వ్యాపారులు చేసే అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. విజయ బ్రాండ్ పేరుతో సమాఖ్య వంట నూనెలను నెల రోజుల వ్యవధిలోనే లీటర్ పామాయిల్ ధర రూ.29కి పెంచింది. ఆ ధర ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వానికి నివేదించింది. రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి దిగుమతి అవుతోన్న పొద్దుతిరుగుడు నూనె ధర కూడా విపరీతంగా పెరుగుతోంది. భారత్‌లో వినియోగించే వంట నూనెల్లో 70 శాతానికిపైగా విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. పామాయిల్, పొద్దు తిరుగుడు నూనెలు అయితే.. 90 శాతం ఇతర దేశాల నుంచే దిగుమతి అవుతుండటం ఈ ధరల పెరుగుదులకు కారణమవుతోంది.
వంటనూనె నిత్యావసర వస్తువు.. అది లేకపోతే వంట ఇంట్లో ఏ ఒక్క పని కూడా చేయలేము. అలాంటి వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో వినియోగదారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఓ వైపు వంటనూనెల ధరలు విపరీతంగా పెరగడం.. మరోవైపు వ్యాపారుల అక్రమాలతో నూనెను అత్యధిక ధర వెచ్చించి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఏర్పడిన గడ్డు పరిస్థితికి తోడు వ్యాపారుల అత్యాశ తోడై ప్రజల పాలిట పెనుభారంగా మారింది. మార్కెట్లో వంట నూనెల విక్రయాలపై టీవీ 9 ప్రతినిధి ఆరా తీయగా.. అక్రమాల బాగోతం బట్టబయలైంది.
విజయవాడ పటమటలోని ఓ కిరాణా షాప్ కు వెళ్లిన టీవీ9 ప్రతినిధి.. నూనె ప్యాకెట్ కావాలని అడిగాడు. షాపు యజమాని ఒక ప్యాకెట్ 165 రూపాయలు చెప్పాడు. కానీ.. MRP ధర రూ. 155 మాత్రమే ఉంది. దీంతో ఎమ్మార్పీ కంటే ఎక్కువ చెబుతున్నావని అడగ్గా.. యుద్ధం నేపథ్యంలో ధరలు పెరిగిపోయాయి చెప్పుకొచ్చాడు. అంతే కాదు.. షాపు యజమాని దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. మేమిలాగే అమ్ముతాం.. మీకు చాతనైంది చేసుకోవాలంటూ దుర్భాషలాడాడు. హోల్‌సేల్ వ్యాపారులు అడ్డగోలుగా దోచుకుంటున్నారని, తాము అధిక ధరలకు విక్రయిస్తే మీకేంటి ప్రాబ్లమ్ అంటూ సమాధానమిచ్చాడు.
అక్కడి నుంచి మరొక దుకాణానికి వెళ్లిన టీవీ9 ప్రతినిధి ఓ కిరాణా షాపులో నూనె ప్యాకెట్ కావాలని అడగ్గా.. రూ. 155 రూపాయలు తీసుకున్నాడు.. 130 రూపాయలే కదా అని ప్రశ్నించగా.. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఆయిల్ లభించే పరిస్థితే లేదంటూ చెప్పుకొచ్చాడు. అక్కడి నుంచి మరో షాప్ కు వెళ్లగా.. అక్కడ కూడా నూనె ప్యాకెట్ కు 140 రూపాయలు తీసుకున్నాడు. మొత్తంగా విజయవాడ పట్టణంలో కిరాణా షాపుల బాదుడు ఒక్కో దుకాణంలో ఒక్కో రకంగా ఉందనే విషయం టీవీ 9 నిఘాలో బయటపడింది. ఒక్క విజయవాడలోనే ఈ పరిస్థితి ఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.
-శివకుమార్, టీవీ9 తెలుగు, విజయవాడ.
Also read:
Russia Ukraine War: తక్షణమే ఖార్కివ్ నుండి బయటపడండి.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ గంటలో రెండో ఆదేశం!