బయటపడుతున్న కనకదుర్గమ్మ గుడి అక్రమాలు.. చర్యలు చేపట్టిన ఏపీ సర్కార్.. 13 మందిపై వేటు

విజయవాడలోని ప్రఖ్యాత కనకదుర్గమ్మ గుడి అక్రమాల భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మూడు రోజులు సోదాలు చేసిన ఏసీబీ... ఇంటి దొంగల గుట్టు రట్టు చేసింది.

బయటపడుతున్న కనకదుర్గమ్మ గుడి అక్రమాలు.. చర్యలు చేపట్టిన ఏపీ సర్కార్.. 13 మందిపై వేటు
Balaraju Goud

|

Feb 23, 2021 | 10:18 AM

ACB Raids At Kanaka Durga Temple : విజయవాడలోని ప్రఖ్యాత కనకదుర్గమ్మ గుడి అక్రమాల భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మూడు రోజులు సోదాలు చేసిన ఏసీబీ… ఇంటి దొంగల గుట్టు రట్టు చేసింది. అక్రమార్కుల చిట్టాలను తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం చర్యలకు తీసుకుంటోంది. ఇప్పటికైతే 13 మందిపై వేటు వేసింది. మరి లిస్టులో ఇంకెమంది ఉన్నారన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

ఇంద్రకీలాద్రిపై ఏసీబీ జరిపిన మూడ్రోజులపాటు తనిఖీల నిర్వహించి దుర్గగుడిలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. జరిగిన అక్రమాలు వెలికితీసిన అవినీతి నిరోధక శాఖ… అక్రమార్కుల లిస్టును ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో స్పందించిన ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు మొదలు పెట్టింది. ముందుగా దుర్గగుడిలో 13 మంది ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు వేసింది. అన్నదానం, టికెట్ల అమ్మకాలు, చీరల విభాగాల్లో అక్రమాలపై నివేదిక ఇచ్చింది ఏసీబీ. ఆ రిపోర్ట్‌ ఆధారంగా 7విభాగాల్లోని ఐదుగురు సూపరింటెండెంట్లు, 8మంది సిబ్బందిని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వానికి ఏసీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సస్పెన్షన్‌ ఆదేశాలిచ్చారు దేవాదాయశాఖ కమిషనర్.

ప్రసాదాలు..తలనీలాలు.. అమ్మవారి చీరల విక్రయాల్లోనూ అవినీతి, అక్రమాలు. ఇక శానిటేషన్‌, సెక్యూరిటీ టెండర్లలో అవకతవకలు వెలుగుచూశాయి. టెండర్లను రీకాల్‌ చేయాలన్న అధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దుర్గ గుడి చాటున జరిగిన అవినీతి చిట్టాపై ఏసీబీ సర్కార్‌కు నివేదిక అందించింది. ఒక్కసారిగా దుర్గగుడి అక్రమాలు వెలుగుచూడటంతో మరోసారి బెజవాడ రాజకీయాలు హీటెక్కాయి.

ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న వరుస సంఘటనలు అధికారులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. మూడు రోజుల ఏసీబీ దాడులు… వెంటనే నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడం… 24 గంటలు గడవక ముందే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం నిజంగానే హీట్‌ పెంచే మేటరే. దుర్గమ్మ గుడిలో కీలక డిపార్ట్‌మెంట్ల నుంచి ఏసీబీ సమాచారం సేకరించింది. అభివృద్ధి పనులు, టెండర్ల ప్రక్రియ, ఇంజనీరింగ్ విభాగాల్లోనూ ఇన్ఫర్మేషన్ తీసుకుంది. అవినీతి, అక్రమాలపై సాక్ష్యాలతో ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.

ఈ ఏసీబీ లిస్టులో ఇంకా ఎవరు ఉన్నారన్న టెన్షన్ ఉద్యోగుల్లో ఉంటే… అసలు వ్యక్తులపై చర్యలు ఉంటాయా లేదా అన్నది ప్రతిపక్షాల ప్రశ్న. ఏసీబీ ఇచ్చిన నివేదికలో ఓ కీలక వ్యక్తిని ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. దుర్గగుడి ఈవో సురేష్‌బాబు నిబంధనలకు విరుద్ధంగా శానిటేషన్‌, సెక్యూరిటీ టెండర్లను కట్టుబెట్టారని రిపోర్టులో చెప్పినట్టు తెలుస్తోంది. KL టెక్నికల్‌, మ్యాక్స్‌ సంస్థలకు ఈ టెండర్లను అక్రమంగా ఇచ్చినట్లు ఏసీబీ గుర్తించింది. స్టోర్స్‌లోనూ ముడిసరుకు కొనుగోళ్లలోనూ అక్రమాలు జరిగినట్లు తేల్చారు అధికారులు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

ఈవోపై మొదటి నుంచి ప్రతిపక్షాలు, భక్తులు ఆరోపణలు చేస్తున్నారు. ఆయనకు ఉన్నత స్థాయిలో పెద్దల అండదండలు ఉన్నాయని చెబుతున్నారు. భక్తుల్ని పట్టించుకోకుండా వీఐపీల సేవలో మునిగి తేలుతున్నారనే టాక్‌ ఉంది. అమ్యామ్యాల కల్చర్ కూడా అయ్యవారు తెచ్చిందేనంటున్నారు భక్తులు. బంధువులు, సన్నిహితులకు కాంట్రాక్టులు కట్టబెట్టారనే టాక్ ఉంది. గుడి మీద చెప్పుల స్టాండ్ నుంచి.. ప్రసాదాల వరకూ ఎక్కడ చూసినా ఏదో ఒక వివాదం బయటపడుతూనే ఉంది.

సోదాల్లో బాగంగా ఆలయ ప్రాంగణంలోని ప్రోవిజన్స్‌ స్టోర్‌, చీరల విభాగం, ప్రసాదం, టికెట్‌ కౌంటర్‌తోపాటు ఇతర విభాగాల్లోనూ ఏసీబీ అధికారులు రికార్డులు పరిశీలించారు. కేశఖండనశాలలోనూ పలు అక్రమాలపైనా దృష్టి పెట్టారు. ఇటీవల దుర్గ గుడి తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. అమ్మవారి వెండిరథంపై సింహాల ప్రతిమల అదృశ్యమైన ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో దాదాపు నాలుగు నెలల విచారణ అనంతరం నిందితులను పట్టుకున్నారు. చోరీ చేసిన వెండిని కూడా అధికారులు రికవరీ చేశారు. దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారి ప్రత్యేక దర్శనం టికెట్లు ధరలు పెంచడం, అడ్వాన్స్‌ బుకింగ్ లేకుండా ఆలయానికి వచ్చిన వారికి అధిక ధరలకు టికెట్లు విక్రయించి దర్శనానికి అనుమతించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

Read Also..  మరికాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం.. బడ్జెట్ సమావేశాలు, ఉక్కు ప్రైవేటీకరణపైనే ప్రధాన చర్చ

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu