Sepoy Maruprolu Jaswanth Reddy died in Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో గుంటూరు జిల్లా జవాను మృతి చెందారు. నిన్న రాజౌరి జిల్లా సుందర్‌బని సెక్టార్‌లో ఎదురు కాల్పులు జరిగాయి. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. రాజోరిలో కూంబింగ్ జరుపుతుండగా కాల్పులకు తెగబడ్డారు తీవ్రవాదులు. సుందర్‌బనీ సెక్టార్‌లో జవాన్లు, టెర్రరిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో..ఇద్దరు పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. మొత్తం మూడు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు జవాన్లు.
మరోవైపు ముష్కరమూకలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మరుప్రోలు జశ్వంత్‌రెడ్డితో పాటు శ్రీజిత్ ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాదకొత్తపాలెం వాసి మరుపోలు జశ్వంత్‌రెడ్డి (23) ఐదేళ్ల క్రితం సైన్యంలో చేరారు. జశ్వంత్‌రెడ్డి మృతితో దరివాద కొత్తపాలెంలో విషాదచాయలు అలముకున్నాయి.
బాపట్ల ప్రాంతంలోని దరివాదా కొత్తపాలెం కు చెందిన యువకుడు మారుప్రోలు జస్వంత్ రెడ్డి (23) తండ్రి శ్రీనివాసరెడ్డి,వెంకటేశ్వరమ్మల కుమారుడు. ఇంట్లో సంతోషకరమైన సందడి జరిగి మాసం రోజులు కాకుండానే విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆర్మీ లాంచనాలతో శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతదేహం బాపట్ల చేరుకోవచ్చునని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆరేళ్ళ క్రితం 17 మద్రాస్ ఇన్ఫరెంట్ రెజిమెంట్ 2016 బ్యాచ్ లో ట్రైనింగ్ తీసుకొని మొదట డ్యూటీ నీలగిరిలో చేశారు. అనంతరం జమ్మూకాశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెలలో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది.