Sajjala Ramakrishna Reddy on Amaravati: అమరావతి అనేది పెద్ద స్కామ్ అని.. ఈ ప్రాంతంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ అందరికీ తెలిసిందేనంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ లేదని సాంకేతిక అంశాలతోనే కోర్టులో తీర్పు వెలువడిందని.. త్వరలో మరో కోణంలో వాస్తవాలు బయటకు వస్తాయంటూ సజ్జల పేర్కొన్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదన్న హైకోర్టు తీర్పును.. ఇటీవలే సుప్రీంకోర్టు కూడా బలపర్చింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈమేరకు సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. అమరావతి ఓ కుంభకోణమన్న సంగతి అందరికీ తెలుసని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ అభిప్రాయం ప్రకారం అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఆయన పేర్కొన్నారు. అమరావతి కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదని త్వరలోనే పేర్లన్నీ బయటకు వస్తాయని వెల్లడించారు. ఏదో ఒక సందర్భంలో నిజాలన్నీ బయటకు వస్తాయని.. తప్పుచేసిన వాళ్లు తప్పించుకోలేరని సజ్జల పేర్కొన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తమ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాటం చేస్తున్నారని.. రాష్ట్రం కోరుతున్న డిమాండ్ విషయంలో కేంద్రం సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నామంటూ సజ్జల పేర్కొన్నారు. ఈ విషయంలో రాజీనామాలకు తాము సిద్ధం అనడమే తప్ప.. టీడీపీ నాయకులు రాజీనామా చేయరంటూ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.
Also Read: