AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3 రాష్ట్రాలు.. 3 భాషలు.. 2 నదులు.. ఆంధ్రా సరిహద్దుల్లోని ఈ అద్భుత ప్రపంచం గురించి తెలుసా..?

ఒకవైపు తెలుగులో బేరసారాలు, మరోవైపు హిందీలో లెక్కలు, ఇంకోవైపు ఒడియాలో ముచ్చట్లు.. ఇదీ శబరి-సీలేరు తీరంలోని సంతల్లో అడుగుపెట్టగానే కనిపించే దృశ్యాలు.. శబరి, సీలేరు నదుల సంగమ తీరంలో వారం వారం జరిగే చింతూరు, కుంట, మోటు సంతలు కేవలం కూరగాయల మార్కెట్లు మాత్రమే కాదు.. మూడు విభిన్న సంస్కృతులు, సరిహద్దు ప్రజల జీవన విధానాలు ఒకటయ్యే అద్భుత వేదికలు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

3 రాష్ట్రాలు.. 3 భాషలు.. 2 నదులు.. ఆంధ్రా సరిహద్దుల్లోని ఈ అద్భుత ప్రపంచం గురించి తెలుసా..?
Andhra Odisha Chhattisgarh Border Market
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Nov 09, 2026 | 4:17 PM

Share

ఒకవైపు స్వచ్ఛమైన గాఢ నీలి రంగులో పరవళ్లు తొక్కే సీలేరు నది.. మరోవైపు మట్టి వాసనలతో గోధుమ రంగులో హుందాగా సాగిపోయే శబరి నది.. ఈ రెండు జీవనదులూ ఒక్కటయ్యే అపురూప సంగమ ప్రదేశం అది. కలిసి ప్రవహిస్తున్నా నీటి రంగుల్లో స్పష్టమైన తేడాతో ప్రకృతి వింతను ఆవిష్కరించే ఈ ప్రాంతమే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల కూడలి. ఒకప్పుడు ఈ నదులను దాటాలంటే నావల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి ఉండేది. కానీ నేడు సీలేరు, శబరి నదుల సంగమ ప్రదేశమైన మోటు వద్ద నిర్మించిన భారీ వంతెనలు సరిహద్దుల రూపురేఖలనే మార్చేశాయి. నిమిషాల వ్యవధిలోనే మూడు రాష్ట్రాలు కలిసిపోతుండటంతో.. చింతూరు, కుంట, మోటు ప్రాంతాలు ఆధునిక రవాణా సౌకర్యాలతో సరికొత్త వాణిజ్య, సాంస్కృతిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి.

వారం వారం సరిహద్దు పండుగ.. సంతల సందడి

ఈ సరిహద్దు ప్రాంతాల్లో సంతల దినం వచ్చిందంటే చాలు.. వంతెనల మీదుగా ఆటోలు, పికప్ వ్యాన్లు, బైకులపై రైతులు, వ్యాపారులు తమ ఉత్పత్తులతో బారులు తీరుతారు. బుధవారం ఏపీలోని చింతూరులో సంత జరిగితే.. గురువారం ఛత్తీస్‌గఢ్ కుంటలో సంత, ఆదివారం ఒడిశా మోటులో సంత జరుగుతుంది. ఈ సంతల్లోకి అడుగుపెట్టగానే నిత్యజీవితంలో పెనవేసుకున్న మూడు భాషల మధుర సంభాషణలు ఆకట్టుకుంటాయి. ఒకే వ్యాపారి ఇక్కడి ఆంధ్రా కస్టమర్‌తో అచ్చతెలుగులో మాట్లాడుతూనే, ఛత్తీస్‌గఢ్ కొనుగోలుదారుడితో సరళమైన హిందీలో లెక్కలు తేలుస్తాడు. పక్కనే ఉన్న ఒడిశా రైతుతో గడగడా ఒడియా భాషలో కూరగాయల ధరలు చర్చిస్తాడు. మూడు భాషలు ఇక్కడ ఎవరికీ పరాయివి కావు.. నిత్య వ్యవహారంలో ఒకరికొకరు అలవాటైన సహజ సంభాషణలు.

దుకాణాల్లో మూడు రాష్ట్రాల తాజా సాగు ఉత్పత్తులు

ఈ ప్రాంత వ్యవసాయ ముఖచిత్రంలో వచ్చిన మార్పులు సంతల్లో పరిచిన దుకాణాల్లో కనువిందు చేస్తాయి.

ఆంధ్రప్రదేశ్ (చింతూరు ఏజెన్సీ): వాణిజ్య పంటలైన ఘాటైన ఏజెన్సీ పచ్చిమిర్చి, నాటు టమాటాలు, తీగజాతి కూరగాయలైన బీర, పొట్ల, కాకరలతో పాటు దేశవాళీ ఆకుకూరలు కుప్పలుగా దర్శనమిస్తాయి.

ఒడిశా (మల్కన్‌గిరి సరిహద్దు): బలవర్ధకమైన నేలల్లో పండించే మేలైన క్యాలీఫ్లవర్, క్యాబేజీ, తీపి గుమ్మడి, చామదుంపలు, ప్రత్యేక రుచి ఉండే నాటు వంకాయలు విక్రయానికి వస్తాయి.

ఛత్తీస్‌గఢ్ : నదీ పరీవాహక ప్రాంతాల్లో సాగయ్యే నాటు బెండకాయలు, సీతాఫలాలు, తోటకూర, పచ్చని బఠానీలతో పాటు ఈ ప్రాంతానికే ప్రత్యేకం, అరుదైన సహజసిద్ధ ఆహారమైన వెదురు చిగుళ్లు విస్తారంగా మార్కెట్లోకి వస్తాయి.

సాంప్రదాయం – ఆధునికత.. కలగలిసిన ఆహార్యం

మనుషుల ఆహార్యంలోనూ కాలంతో పాటు వచ్చిన మార్పులు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. ఒడిశా మహిళలు తమ సాంప్రదాయ సంబల్‌పురి చేనేత చీరలతో సంతకు వస్తే, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రా యువత జీన్స్, కుర్తీలతో ఆధునిక హంగులు ఒలకబోస్తున్నారు. గ్రామీణ సంతే అయినప్పటికీ చేతిలోని స్మార్ట్‌ఫోన్లతో డిజిటల్ చెల్లింపులు చేస్తూ కాయగూరలు కొనుగోలు చేస్తుండటం విశేషం. పెద్దల సంప్రదాయ ఆహార్యం, నేటి తరం ఆధునిక పోకడలు పక్కపక్కనే సహజీవనం చేసే అరుదైన వేదికగా ఈ సంతలు నిలుస్తున్నాయి.

సాయంత్రం వేళ సూర్యుడు శబరి నదిలో ప్రతిబింబిస్తుండగా.. వేర్వేరు రాష్ట్రాల నంబర్ ప్లేట్లతో ఉన్న వాహనాలు సరుకులతో తమ గమ్యస్థానాలకు తిరుగుముఖం పడతాయి. నదులపై పడ్డ కొత్త వంతెనలు కేవలం రోడ్లను మాత్రమే కలపలేదు.. మూడు రాష్ట్రాల ప్రజల వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని, ఆధునిక జీవనశైలిని మరింత దగ్గర చేసి ఒకే సాంస్కృతిక వేదికగా నిలబెట్టాయి. భిన్నత్వంలో ఏకత్వానికి ఈ సరిహద్దు కూడలే సజీవ సాక్ష్యం.

వీడియో చూడండి..

Follow Us