PM Modi Tirupati Visit: తిరుపతికి ప్రధాని మోదీ.. డిసెంబర్ 4 నుంచి మూడు రోజుల పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే!
PM Modi Tirupati Visit: ప్రధాని నరేంద్రమోదీ డిసెంబరు 4 నుంచి డిసెంబరు 6 వరకు మూడురోజుల పాటు తిరుమలలో పర్యటించనున్నారు. తిరుపతి IISER (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) వేదికగా జరగనున్న ‘డీజీపీ, ఐజీపీల సదస్సు - 2026’లో..

PM Modi Tirupati Visit: ఏపీలోని తిరుపతి మరో కీలక జాతీయ స్థాయి కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 4 నుంచి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహించే 61వ అఖిల భారత డీజీపీ, ఐజీపీల సదస్సులో ఆయన పాల్గొననున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సీనియర్ పోలీసు అధికారులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేపట్టాయి.
డిసెంబర్ 4న తిరుపతికి ప్రధాని రాక
ప్రధాని మోదీ డిసెంబర్ 4వ తేదీ రాత్రి 8.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) కేంద్రానికి వెళ్లనున్నారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ప్రధానికి ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలకనున్నారు.
డిసెంబర్ 5న పోలీసు ఉన్నతాధికారుల సదస్సు
డిసెంబర్ 5వ తేదీన ఉదయం నుంచి రాత్రి వరకు ప్రధాని మోదీ పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొంటారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన డీజీపీలు, ఐజీపీలు సహా సుమారు 200 మంది ఐపీఎస్ అధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. అలాగే దేశ అంతర్గత భద్రత, పోలీసు వ్యవస్థ ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లు, నేరాల నియంత్రణపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరగనున్నాయి.
డిసెంబర్ 6న తిరుమల శ్రీవారి దర్శనం
డిసెంబర్ 6వ తేదీ ఉదయం కూడా ప్రధాని మోదీ పోలీసు ఉన్నతాధికారుల సదస్సులో పాల్గొంటారు. ఉదయం 9.25 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఐసర్ కేంద్రం నుంచి తిరుమలకు బయలుదేరుతారు. అదే రోజు సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
