Collector Bungalow: అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ కు పెను ప్రమాదం తప్పింది. జిల్లా కలెక్టర్ నివాసముంటున్న బంగ్లా పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే కొన్ని నిమిషాల ముందే ఈ మార్గం గుండా లోపలికి వెళ్ళిన కలెక్టర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అనంతపురం జిల్లాలో కలెక్టర్ కార్యాలయం తో పాటు కలెక్టర్ నివాసముండే బంగ్లా బ్రిటిష్ కాలంలో నిర్మించినది. ప్రస్తుతం కలెక్టర్ గా ఉన్న నాగలక్ష్మి సెల్వరాజన్ 101వ కలెక్టర్ గా ఉన్నారు. నాగలక్ష్మి సెల్వరాజన్ కొద్ది రోజుల క్రితమే అనంతరపురం జిల్లాకు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.
కలెక్టర్ బంగ్లాలోనే రెండు నెలలుగా నివాసం ఉంటున్నారు. గురువారం సాయంత్రం సమయంలో బంగ్లాలో ఉన్న ఒక పై కప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ సమయంలో భారీ శబ్దం వచ్చింది. ప్రమాద ఘటనా సమయంలో కలెక్టర్ బంగ్లా లోనే ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తచెరువు పర్యటన ముగించుకొని బంగ్లా కు చేరుకున్న కలెక్టర్ సచివాలయాల ప్రత్యేక సీఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా పాల్గొన్నారు. ఇదే సమయంలో బంగ్లాలో పైకప్పు కూలినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదాన్ని బయటికి పొక్కనివ్వకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. బ్రిటిష్ కాలం నాటి బంగ్లా కావడంతోనే శిథిలావస్థకు చేరుకుని కూలినట్లు అభిప్రాయపడుతున్నారు. అయితే బిల్డింగ్ నాణ్యత విషయంలో ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. బంగ్లా లో జరిగిన సంఘటనలో తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలియజేశారు.
Also Read: