గుంటూరు బ్రాడీ పేటలో ఎమ్ ఎన్ ఎక్స్ పోర్టర్స్ కంపెనీ ఉంది. కంపెనీలో హరిబాబు గత పదేళ్లుగా గుమాస్తాగా పని చేస్తున్నాడు. ఈ కంపెనీ మిర్చి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటుంది. అయితే నిన్న హరిబాబు లక్ష్మీ పురంలో హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ కు వెళ్ళాడు. యజమాని చెప్పినట్లుగానే పది లక్షల రూపాయలు డ్రా చేశాడు. హ్యాండ్ బ్యాగ్ లో క్యాష్ సర్దుకొని బయటికొచ్చాడు. బయట తన బైక్ పై కూర్చొన్నాడు. బైక్ స్టార్ట్ చేసే సమయంలో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఇరవై రూపాయల నోట్లు పడిపోయాయని చెప్పాడు. బైక్ పక్కన చూసిన హరిబాబు కి ఇరవై రూపాయల నోట్లు కనిపించాయి.ఇంకేముంది పది లక్షల రూపాయల క్యాష్ బ్యాగ్ బైక్ పెట్టిన హరిబాబు బైక్ దిగి ఇరవై రూపాయల నోట్లు ఏరుతున్నాడు. అదే సమయంలో మరో ఆగంతకుడు బైక్ పై క్యాష్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు. కొద్దీ దూరంలో బైక్ పై వేచి ఉన్న వ్యక్తితో కలిసి అదే బైక్ పై పారి పోయాడు. దీంతో హరిబాబు కంగారు పడుతూ కేకలు వేశాడు. అప్పటికే ముగ్గురు ఆగంతకులు మదర్ థెరిస్సా విగ్రహం వైపు పారిపోయారు. దీంతో హరిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పట్టాభిపురం పోలీసులు బ్యాంక్ లో సిసి కెమెరా విజువల్స్ పరిశీలించారు. ముఖానికి మాస్క్ లు పెట్టుకున్న ముగ్గురు వ్యక్తులు అత్యధిక క్యాష్ డ్రా చేస్తున్న వారిని గమనించినట్లు రికార్డు అయింది. ఆ ముగ్గురే హరిబాబు కనుగప్పి పది లక్షల రూపాయల బ్యాగ్ అపహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ తరహా నేరాలు చేయడంలో తమిళనాడు గ్యాంగ్స్ సిద్ధహస్తులని వారే దోపిడికి పాల్పడినట్లు ప్రాధమికంగా అంచనాకు వచ్చారు.
అయితే గతంలోనూ హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ వద్ద ఇదే తరహాలో బైక్ పై వెంబడించి మిర్చి గుమాస్తా వద్ద నుండి బ్యాగ్ లాక్కొని వెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు గుమాస్తా అప్రమత్తంగా ఉండటంతో నగదు బ్యాగ్ పోలేదు. అప్పటి నిందితుడిని ఇంతవరకూ పట్టుకోలేక పోయారు.
ఇటువంటి తరహా చోరీలు తరుచూ జరుగుతుండటంతో మిర్చి వ్యాపారులు భయాందోళనలకు గురవుతున్నారు. వెంటనే బ్యాంక్ లో వద్ద పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకోవాలంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..