AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మా దగ్గర మహిమగల రాగి చెంబులు ఉన్నాయి.. మీ ఇంట్లో ఉంటే డబ్బే డబ్బు.. కట్‌చేస్తే..

రాగి చెంబు దగ్గరకు టార్చ్ లైట్ తీసుకెళ్తే లైట్ ఆగిపోతుందా..? దీన్నే ఏదో అద్భుత మహిమ అనుకుని నమ్మితే మీరు నిలువునా మునిగిపోయినట్లే..మహిమగల రాగి చెంబుల పేరిట అమాయకులను ముంచేందుకు ప్లాన్ చేసిన ఒక కేటుగాళ్ల ముఠా గుట్టును శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు రట్టు చేశారు. వీళ్లు ప్రజలను ఎలా బురిడీ కొట్టిస్తున్నారో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

Andhra Pradesh: మా దగ్గర మహిమగల రాగి చెంబులు ఉన్నాయి.. మీ ఇంట్లో ఉంటే డబ్బే డబ్బు.. కట్‌చేస్తే..
Rice Pulling Gang Busted In Sri Sathya Sai District
Nalluri Naresh
| Edited By: |

Updated on: Jul 24, 2026 | 8:40 PM

Share

మహిమగల రాగి చెంబులు ఉన్నాయి.. ఇవి ఇంట్లో ఉంటే కోట్లు కురుస్తాయి.. అంటూ అమాయక ప్రజలను బురిడీ కొట్టించేందుకు ప్లాన్ వేసిన ఎనిమిది మంది సభ్యుల రైస్ పుల్లింగ్ ముఠాను శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి వాహనాలు, మోసానికి ఉపయోగించే రసాయన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నల్లచెరువు మండలం ఇందుకూరుపల్లి గ్రామ శివారులోని ఒక ఫామ్ హౌస్ వద్ద కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్కడ సంచరిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, వారి భారీ మోసం బయటపడింది.

వెలుగులోకి వచ్చిన కేటుగాళ్ల లీలలు..

పట్టుబడిన వారిలో ప్రధాన నిందితుడు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నాగ దుర్గాప్రసాద్. ఈయన రాగి చెంబులపై ప్రత్యేక రసాయన పూత పూసే విద్యను నేర్చుకున్నాడు. రసాయనం పూసిన రాగి చెంబుకు సమీపంలో టార్చ్ లైట్ వెలిగించినప్పుడు, ఆ కెమికల్ ప్రభావానికి లైట్‌లోని ఫిలమెంట్ కాలిపోతుంది. దీన్నే ఏదో దివ్య మహిమగా, అద్భుత శక్తిగా నమ్మించి అమాయకుల నుంచి లక్షల రూపాయలు దండుకోవడానికి ప్లాన్ చేశారు. కదిరికి చెందిన శేషఫణి అనే వ్యక్తి అడ్డదారిలో ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆశతో నాగ దుర్గాప్రసాద్‌ను నల్లచెరువుకు పిలిపించాడు. వీరికి తోడుగా కదిరి, వైఎస్సార్ కడప, తెలంగాణ ప్రాంతాలకు చెందిన మరో ఆరుగురు జతకలిసి రాగి చెంబుల తయారీకి అవసరమైన సామగ్రిని సమకూర్చుకున్నారు.

పట్టుబడిన నిందితుల వివరాలు

ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో కదిరికి చెందిన శేషఫణి, సర్దార్ అలీ, దాదాపీర్, షమీవుల్లా, పశ్చిమగోదావరికి చెందిన నాగ దుర్గాప్రసాద్, తెలంగాణకు చెందిన వెంకటేశ్, రాజు, కడప జిల్లాకు చెందిన రామసుబ్బారెడ్డి ఉన్నారు. వారి వద్ద నుంచి 4 రాగి చెంబులు, 2 ప్రత్యేక టార్చ్ లైట్లు, 8 మొబైల్ ఫోన్లు, 1 కారు, 1 బైక్ స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల హెచ్చరిక – కేసు నమోదు

నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ నాగేంద్ర తెలిపారు. ‘‘ప్రకృతిలో మహిమగల రాగి చెంబులు లేదా రైస్ పుల్లింగ్ పరికరాలు అనేవి శాస్త్రీయంగా ఏవీ ఉండవు. ఇవన్నీ కేవలం రసాయనాలతో అమాయకులను మోసం చేయడానికి కేటుగాళ్లు చేసే జిమ్మిక్కులు మాత్రమే. ఈజీ మనీకి అలవాటు పడి ఇలాంటి మోసగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకోవద్దు. ఇలాంటి ముఠాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి’’ అని సీఐ నాగేంద్ర తెలిపారు.

Follow Us