ప్రభుత్వ కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడం సరికాదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్ల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు వర్తింపజేయాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ప్రభుత్వ, కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగుల సర్వీసు నిబంధనలు వేర్వేరుగా ఉంటాయని తెలిపింది. ఏపీఈడబ్ల్యూఐడీసీ, మరికొన్ని కార్పొరేషన్లలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు.. తమ పదవీ విరమణ వయసును 62 ఏళ్ల వరకు పొడిగించేలా ఆదేశించాలని కోరుతూ గతేడాది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. 62 ఏళ్ల పదవీ విరమణ వయసు పొందేందుకు పిటిషనర్లు అర్హులేనని తీర్పునిచ్చారు. అయితే ఆ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ గతేడాది డిసెంబర్‌లో ధర్మాసనం ముందు అప్పీళ్లు వేయడంతో వాటిపై ధర్మాసనం విచారణ జరిపింది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు.ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు. అలాగే పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ..కార్పొరేషన్‌లో పనిచేసే ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండే పనులు చేస్తారని అందువల్ల వారికి కూడా 62 ఏళ్లు వర్తిస్తుందన్నారు.ఇరుపక్షాల వాదనలూ విన్న ధర్మాసనం.. 62 ఏళ్ల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు పొందిన ప్రయోజనం లాగే కొర్పొరేషన్ల ఉద్యోగులు ప్రయోజనం పొందేందుకు అర్హులు కాదంటూ తీర్పునిచ్చింది. కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగులకు వారి సొంత నిబంధనలు ఉంటాయని స్పష్టం చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..