Andhra: విదేశీ మహిళపై అత్యాచారయత్నం.. రెండు నెలల్లోపే విచారణ పూర్తి.. కోర్టు సంచలన తీర్పు

విదేశీ మహిళపై అత్యాచారయత్నం కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇద్దరు నిందితులకు అర్థ జీవిత ఖైదు విధించింది కోర్టు.

Andhra: విదేశీ మహిళపై అత్యాచారయత్నం.. రెండు నెలల్లోపే విచారణ పూర్తి.. కోర్టు సంచలన తీర్పు
Representative Image

Updated on: May 06, 2022 | 7:56 AM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు నెల్లూరు జిల్లా(Nellore district)లో జరిగిన అఘాయిత్యం తాలూకూ ఘటన అది. ఈ దారుణంపై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితులకు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో సాయికుమార్, మహమ్మద్ అభిద్‌లు నేరస్థులుగా నిర్ధారణ కావడంతో శిక్ష ఖరారు చేసింది కోర్టు. 8వ అదనపు జిల్లా సెషెన్స్ కోర్టు న్యాయమూర్తి సి. సుమ నేరస్థులకు అర్థ జీవిత ఖైదు విధించారు. జీవితకాలంలో సగం శిక్షను అనుభవించేలా తీర్పు చెప్పారు. అలాగే ఒక్కొక్కరికి రూ. 15వేల చొప్పున జరిమానా విధించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు లిథువేనియా వనితపై అత్యాచారయత్నం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. భారత్‌లో పర్యాటక సందర్శన కోసం వచ్చిన మహిళతో పరిచయం పెంచుకున్న సాయికుమార్ తన స్నేహితుడు అబిడ్‌తో కలిసి లైంగికదాడికి యత్నించాడు. ఈ ఘటనపై బాధితురాలు సైదాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన దిశా పోలీసులు పది రోజుల్లోనే కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసుపై 8వ అదనపు మొదటి తరగతి జ్యుడిషియల్ కోర్టులో విచారణ కొనసాగింది. వీసా గడువు ముగియడంతో ఇప్పటికే స్వదేశానికి వెళ్లిపోయింది బాధితురాలు. ఇరువురు నేరస్థులకు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సి. సుమ శిక్ష ఖరారు చేశారు. ఇరువురిపై నేరారోపణ నిర్ధారణ కావడంతో సగం జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి 15 వేలు చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. మార్చి 8న ఘటన జరగ్గా.. రెండు నెలల్లోపే శిక్ష పడడం చాలా అరుదు.

(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి గుర్తింపు, ఆమె గోప్యతను కాపాడేందుకు.. వివరాలు బహిర్గతం చేయబడలేదు)

Also Read: Viral: వాయమ్మో..! ఎంత పిచ్చి ప్రేమ అమ్మాయ్.. లవర్ కోసం మరీ ఇలానా..?