AP News: ఉపాధి చూపిన ఉద్యోగం.. ప్రాణం తీసిన ప్రమోషన్.. అసలు కథ ఇదే..

| Edited By: Srikar T

Jan 31, 2024 | 11:00 PM

విజయనగరం జిల్లా రాజాం పంచాయితీరాజ్ ఇంజనీర్ రామకృష్ణ తాను పనిచేస్తున్న కార్యాలయంలోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రామకృష్ణ ఆత్మహత్య జిల్లాలో సంచలనం రేపింది. రామకృష్ణ ది హత్యా? ఆత్మహత్యా? అనే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రామకృష్ణ స్వగ్రామం రేగిడి మండలం సోమరాజుపేట గ్రామం.

AP News: ఉపాధి చూపిన ఉద్యోగం.. ప్రాణం తీసిన ప్రమోషన్.. అసలు కథ ఇదే..
Panchayat Raj Engineer
Follow us on

విజయనగరం జిల్లా రాజాం పంచాయితీరాజ్ ఇంజనీర్ రామకృష్ణ తాను పనిచేస్తున్న కార్యాలయంలోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రామకృష్ణ ఆత్మహత్య జిల్లాలో సంచలనం రేపింది. రామకృష్ణ ది హత్యా? ఆత్మహత్యా? అనే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రామకృష్ణ స్వగ్రామం రేగిడి మండలం సోమరాజుపేట గ్రామం. అయితే ప్రస్తుతం రాజాంలో కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నారు. రామకృష్ణ ఇంజనీరింగ్ పూర్తి అయిన తరువాత పంచాయితీరాజ్ శాఖలో కాంట్రాక్ట్ పద్దతిలో సైట్ ఇంజనీర్‎గా చేరారు. తరువాత ఉద్యోగం కూడా రేగిడి మండలంలోనే కాబట్టి కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నారు.

ఈ క్రమంలోనే సైట్ ఇంజనీర్‎గా ఉన్న రామకృష్ణకు అసిస్టెంట్ ఇంజనీర్‎గా కూడా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఏఈ గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి విధుల్లో రామకృష్ణకి ఒత్తిడి పెరిగింది. దీంతో మండలంలోని పలు ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం మండలానికి వచ్చిన సిమెంట్ బస్తాల్లో జరిగిన అవకతవకలు మరింత ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. రేగిడి మండలంలోని మొత్తం 25 సచివాలయ భవనాలు పరిధిలో 87 భవనాలు మంజూరు అయ్యాయి. వాటికోసం 2019 నవంబర్ నుంచి 2020 ఫిబ్రవరి వరకు 52,200 సిమెంట్ బస్తాలు మండలానికి వచ్చాయి. ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వం నిర్మించే ప్రభుత్వ భవనాలకు ఈ సిమెంట్ వినియోగించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

అధికారిక లెక్కల ప్రకారం మండలంలో కేవలం 19 భవనాలు మాత్రమే పూర్తిస్థాయిలో నిర్మాణాలు జరగగా, కొన్ని సచివాలయాల పరిధిలో అసలు పనులే ప్రారంభం కాలేదు. అయితే మండలానికి వచ్చిన సిమెంట్ మాత్రం సర్దుబాట్లులో భాగంగా కొంత, మరికొంత గడ్డ కట్టినట్లు అయిపోయింది. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన రేగిడి మండల సర్వసభ్య సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధుల సమక్షంలో సిమెంట్ బస్తాల లెక్కల పై చర్చ జరిగింది. అయితే ఆ చర్చలో రామకృష్ణ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, పెద్ద ఎత్తున సిమెంట్ బస్తాల్లో అక్రమాలు జరిగాయని పలువురు సభ్యులు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా సిమెంట్ పొందిన ఏ ఒక్క నాయకుడు రామకృష్ణకు అండగా నిలవలేదు. అంతేకాకుండా సర్దుబాటులో భాగంగా అనధికారికంగా తీసుకున్న సిమెంటు బస్తాలు తర్వాత రోజుల్లో తిరిగి ఇవ్వకపోగా, అందుకు సంబంధించిన నగదు కూడా ఇవ్వకపోవడంతో రామకృష్ణ అడ్డంగా దొరికిపోయారు. ఉన్నతాధికారులు సైతం రామకృష్ణనే టార్గెట్ చేస్తూ గత నెల శాలరీ ఆపడంతో పాటు, షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రామకృష్ణ తాను పనిచేస్తున్న కార్యాలయంలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులపై దాడికి దిగారు. పోలీసులు సైతం పరిస్థితి అదుపులోకి తీసుకురావడం కష్టతరంగా మారింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామకృష్ణ ది ఆత్మహత్య కాదు హత్య అని కుటుంబ సభ్యులు అంటుంటే మనస్థాపంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని ఉద్యోగులు అంటున్నారు. ఏదేమైనా సిమెంట్ బస్తాల లెక్కల్లో తేడాలే రామకృష్ణ ప్రాణాలను బలితీసుకుంది అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అధికారుల వేధింపుల కారణంగా చనిపోయిన రామకృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు బంధువులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..