సంచలన దర్శకుడు.. వివాదాల వర్మ గత కొంత కాలంగా రాజకీయాలవైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్జీవీ చూపు రాజకీయ నేపధ్య సినిమాలపై పడింది. తాజాగా సీఎం జగన్ కు మద్దతుగా వ్యూహం సినిమా ను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ వ్యూహం మూవీ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌పై ప్రభావం ఎంత? 30 శాతం పూర్తైన సినిమాపై ముఖ్యమంత్రి ఎలాంటి మార్పులు చెప్పారు?. వ్యూహం మూవీతో వైసీపీ ప్లాన్ వర్క్‌అవుట్ అవుతుందా? లేదా అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠం నెలకొంటుంది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని మరోసారి కలిశారు రాంగోపాల్‌వర్మ. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో గంటపాటు సమావేశమయ్యారు. ఏపీ రాజకీయాలపై ఆర్జీవీ తెరకెక్కిస్తోన్న వ్యూహం మూవీపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. 30 శాతం షూటింగ్ కంప్లీట్ కావడంతో జగన్‌కు సన్నివేశాలను చూపించారు వర్మ.
పలు అంశాలపై సీఎం జగన్ నుంచి వర్మ క్లారిటీ తీసుకున్నట్టు తెలిసింది. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ ఎలా ఉండాలనేదానిపై సలహాలు తీసుకున్నట్టు సమాచారం. అయితే, ఈ సినిమా బయోపిక్ కాదు.. రియల్ పిక్చర్ అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వర్మకు సూచించినట్టు తెలుస్తోంది. సీఎం జగన్ బయోపిక్‌గా జరుగుతోన్న ప్రచారాన్ని కూడా ఖండించాలని గట్టిగా చెప్పినట్టు టాక్. ఇప్పటికే రెండు సార్లు సీఎం జగన్ తో భేటీ కావడంతో ఖచ్చితంగా ప్రతిపక్షాలను సినిమాలో ఎండగడతారని ప్రచారం జరుగుతోంది.
సీఎంతో భేటీ తర్వాత గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో మాట్లాడారు ఆర్జీవీ. ఇప్పటికే సినిమా 30శాతం కంప్లీట్ అయినట్లు చెప్పారు రాంగోపాల్ వర్మ. రామ్‌గోపాల్‌వర్మ అంటేనే కాంట్రవర్సీస్‌కి కేరాఫ్ అడ్రస్. ఆర్జీవీ చేష్టలు, మాటలే కాదు సినిమాలూ అంతే కాంట్రవర్సీ సృష్టిస్తాయన్న సంగతి తెలిసిందే.. వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలు ఎంత కాంట్రవర్సీ సృష్టించాయో… అంతకుమించి వ్యూహం మూవీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అటు వైసీపీ, ఆర్జీవీ.