AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముఖానికి గాయం.. పిల్లలు కూడా దగ్గరకు రాని పరిస్థితి.. అడ్డంకులు దాటి.. ఆత్మవిశ్వాసంతో నిలిచి..

రంగు, రూపంపై హేళనలు, బాల్య వివాహం, విడాకులు, దారిద్ర్యం, ప్రమాదాలను తట్టుకొని రాజకుమారి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. టైలరింగ్ చేస్తూనే తనలోని నటిని గుర్తించి, రీల్స్‌తో లక్షల మంది ఫాలోవర్లను సంపాదించారు. భయం షార్ట్ ఫిల్మ్‌లో ఉత్తమ నటి అవార్డు అందుకుని, సమాజానికి స్ఫూర్తిగా నిలిచారు.

ముఖానికి గాయం.. పిల్లలు కూడా దగ్గరకు రాని పరిస్థితి.. అడ్డంకులు దాటి.. ఆత్మవిశ్వాసంతో నిలిచి..
Rajakumari
Ram Naramaneni
|

Updated on: Oct 21, 2026 | 4:18 PM

Share

ఆమె కలర్ గురించి.. ఆమె రూపం గురించి చాలామంది చులకనగా మాట్లాడారు.. వరుసగా ఎదురైన అడ్డంకులను ఛేదించి, ఆత్మవిశ్వాసమే అసలైన సౌందర్యం అని నిరూపించారు రాజకుమారి. తూర్పు గోదావరి జిల్లా తోకాడ స్వస్థలం అయిన రాజకుమారి బాల్యం నుంచే కష్టాలను చూశారు. చిన్నప్పటి నుంచీ నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ, రూపం, రంగు, చదువు విషయంలో ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నారు.

పదో తరగతి చదువుతుండగానే తన ఇష్టంతో సంబంధం లేకుండా మేనమామతో వివాహం జరిగింది. కొత్త జీవితం ప్రారంభమవుతుందని ఆశపడిన ఆమెకు నిరాశే మిగిలింది. అందంగా లేవని, నల్లగా ఉన్నావని భర్త వదిలేయడంతో పుట్టింటికి చేరారు. ఈ గాయం మానకముందే, ఏడాది తిరక్కుండానే తండ్రి మరో వ్యక్తితో రెండో పెళ్లి చేశారు. అయితే ఆ పెళ్లి తర్వాత రాజకుమారి జీవితం మరింత కఠినంగా మారింది. రెండో భర్త బాధ్యతారాహిత్యం, ఎటువంటి పని చేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి. ఈ లోగా వరుసగా ముగ్గురు పిల్లలు పుట్టారు.

ముగ్గురు పిల్లలతో నిస్సహాయ స్థితిలో ఒంటరిగా నిలబడ్డ రాజకుమారి, వారి భవిష్యత్తు కోసం బతకాలని నిర్ణయించుకున్నారు. టైలరింగ్ నేర్చుకొని జీవనాధారంగా మలచుకున్నారు. కట్టుకోవడానికి సరైన దుస్తులు, కడుపునిండా తిండి లేని పరిస్థితులలో కూడా తన కలను వదులుకోలేదు. పిల్లల కోసం, తనకంటూ ఒక గుర్తింపు కోసం ఇన్స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం ప్రారంభించారు. ఎలాంటి మేకప్ లేకుండా, తన సహజ రూపంతో ప్రజల ముందుకు వచ్చారు. వీడియోల కింద దారుణమైన కామెంట్లు వచ్చినా వెనుకాడలేదు.

రీల్స్ ప్రయాణం సులువుగా సాగలేదు. ఒక భయంకరమైన బైక్ ప్రమాదంలో ఆమె ముఖం తీవ్రంగా గాయపడింది. అద్దంలో తన ముఖాన్ని చూసుకోవడానికే భయపడ్డ ఆ పరిస్థితుల్లో, పిల్లలు కూడా తన దగ్గరకు రాకుండా అయ్యారని చాలా బాధపడ్డారు. అయినప్పటికీ, ఇది కేవలం దెబ్బలు మాత్రమే, ప్రాణం పోలేదు కదా అని ధైర్యం తెచ్చుకున్నారు. తన ప్రాణం ఉన్నంతవరకు పిల్లల కోసం నిలబడాలని, తన కల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నారు. అదే దెబ్బలతో, అదే రూపంతో మళ్ళీ ప్రజల ముందుకు వచ్చారు.

ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం వృథా పోలేదు. జీరో నాలెడ్జ్, ఎలాంటి యాక్టింగ్ కోర్సులు లేకుండానే భయం అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించి, ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. కొన్ని ఆడిషన్లలో రంగు ఆధారంగా అవమానాలు ఎదురైనా, ఆమె పట్టువదలలేదు. ఒక పెద్ద సినిమాలో సైడ్ క్యారెక్టర్‌గా సెలెక్ట్ అయ్యి నటించారు.

అందం కాదు, ఆత్మవిశ్వాసం, సాధించాలనే సంకల్పం ఉంటే చాలు, మనోధైర్యమే మనల్ని గెలిపిస్తుందని రాజకుమారి చెబుతున్నారు. మహిళలు సాధించలేనిదంటూ ఏదీ లేదని, లక్ష్యం ఏర్పరచుకొని ముందుకు సాగితే విజయం వరిస్తుందని ఆమె సందేశం. తల్లిదండ్రులు తమ కుమార్తెల కష్టాలను అర్థం చేసుకోవాలని, సమస్యలు వచ్చినప్పుడు “ఓర్చుకో” అని చెప్పడం కాకుండా, అండగా నిలబడాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. కొడుకులు మారతారనే నమ్మకంతో కాకుండా, వారి బాధ్యతను బట్టి వివాహాలు చేయాలని హితవు పలికారు. రాజకుమారి కష్టాలు, అవమానాలను తట్టుకొని తన పిల్లల భవిష్యత్తు, తన గుర్తింపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆమె ప్రస్థానం నిజంగా చాలామందికి ఇన్‌స్పిరేషన్.

Follow Us