Weather Report: తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. పలు ప్రాంతాల్లో భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోన పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అటు ఏపీలోని పలు జిల్లాల్లో బుధవారం వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక..
Rains In Telangana And Andhra Pradesh

Updated on: Mar 18, 2026 | 6:59 AM

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. భిన్న వాతావరణ పరిస్థితులు ఏపీ, తెలంగాణలో నెలకొన్నాయి. మొన్నటివరకు ఎండ తీవ్రత కొనసాగగా.. రెండ్రోజుల నుంచి వానల పడుతున్నాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న చిరు జల్లులతో ఎండ ప్రభావం నుంచి ప్రజలకు చల్లని ఊరటనిచ్చాయి. భానుడి ప్రతాపం నుంచి కొంత ఉపశమనం లభించింది. కొన్ని జిల్లాల్లో స్వల్ప వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని జిల్లాల్లో ఎండలు కొనసాగుతున్నాయి. మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురవగా.. మార్చి 18న కూడా వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు కూడా ఇచ్చింది. వాతావరణశాఖ అంచనాల ప్రకారం బుధవారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం.

ఈ జిల్లాలకు వర్షసూచన

ఏపీలోని పలు జిల్లాలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. పోలవరం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేసింది. పిడుగులు పడే అవకాశం ఉన్న క్రమంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించింది. వర్షాల క్రమంలో వచ్చే నాలుగు రోజుల పాటు కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని తెలిపింది. రెండు, మూడు డిగ్రీలు ఎండలు తగ్గుతాయని స్పష్టం చేసింది.

తెలంగాణకు వర్షసూచన

ఇక తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని హెచ్చరించింది. కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్, గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక శంషాబాద్, చంద్రాయణగుట్ట, చార్మినార్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, వనస్థలిపురం, బండ్లగూడ జాగీర్, కాటేదాన్, కార్వాన్, రాజేంద్రనగర్, బహదూరుపురా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. కాగా గడిచిన 24 గంటల్లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, లక్డీకపూర్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షాల క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. విద్యుత్ స్తంభాల వద్ద ఉండవద్దని, హోర్డింగ్స్, చెట్లు పడిపోయే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

 

Follow Us