Rain Alert For AP and Telangana: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఏపీ, తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీని ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశాల మీదుగా బంగాళాఖాతం వరకు 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితలద్రోణి, ఒడిశాపై గాలులతో ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిఉంది. వీటి ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. ముఖ్యంగా ఉత్తరకోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఐఎండీ అధికారులు. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు, అధికారులు. సాధారణంగా సీజన్ ప్రారంభంలో ఉత్తరకోస్తా వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత మిగిలిన కోస్తా ప్రాంతాలు, రాయలసీమలో రుతుపవనాలు మెల్లగా విస్తరిస్తాయి. కానీ, ఈసారి ముందుగా రాయలసీమలో వర్షాలు కురిశాయి. కర్నూలు, కడప, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో రుతుపవనాలు మరింత ఉధృతమై మంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..