హైస్పీడ్‌ ట్రైన్ వస్తోంది.. హైదరాబాద్‌ టూ విశాఖ ప్రయాణం నాలుగున్నర గంటలే

ప్రతిపాదిత హైదరాబాద్‌-విజయవాడ-విశాఖపట్నం, కర్నూలు-విజయవాడ హైస్పీడ్‌ కారిడార్లలో గంటకు గరిష్ఠంగా 220 కిమీ వేగంతో వెళ్లేలా కొత్త లైన్లను నిర్మించాలన్నది రైల్వేశాఖ ప్రతిపాదన. ఈ ప్రతిపాదిత హైస్పీడ్‌ రైలు కారిడార్‌లో రెండు రూట్లు ఉన్నాయి. మొదటిది హైదరాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు. రెండోది ఏపీలోని కర్నూలు నుంచి విజయవాడ వరకు.

హైస్పీడ్‌ ట్రైన్ వస్తోంది.. హైదరాబాద్‌ టూ విశాఖ ప్రయాణం నాలుగున్నర గంటలే
Bullet Train (Representative image)

Updated on: Feb 03, 2024 | 12:00 PM

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వందే భారత్ ఎక్స్‌ప్రైస్ ట్రైన్స్ పరుగులు పెడుతోన్న విషయం తెలిసిందే. ఇవే కాక.. ఆంధ్రా, తెలంగాణలోని మెయిన్ సిటీలను అనుసంధానం చేస్తూ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టుకు సంబంధించి చేపట్టిన ప్రాథమిక సర్వే చివరి దశకు చేరుకుంది. ఈ మార్చి లోపల ప్రాథమిక ఇంజినీరింగ్‌, ట్రాఫిక్‌ (పెట్‌) స్డడీ సర్వే కంప్లీట్ చేయనున్నారు. ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా సమగ్రమైన సర్వే (డీపీఆర్‌) కోసం మరో కన్సల్టెన్సీని ఏర్పాటు చేయనున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. హైస్పీడ్‌ రైలు అందుబాటులోకి వస్తే.. శంషాబాద్‌ నుంచి నాలుగున్నర గంటల్లోనే విశాఖకు చేరుకోవచ్చు. అన్ని పనులు అనుకున్నట్లు జరిగితే.. ఐదారేళ్లలో తెలుగు రాష్ట్రాలకు హైస్పీడ్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి.

ఈ ప్రస్టీజియస్ ప్రాజెక్ట్ కోసం రూ.20,000 కోట్లకుపైగా వ్యయం అవుతుందని రైల్వే శాఖ ప్రథమికంగా అంచనా వేసింది. ఎక్కడెక్కడ వంతెనలు, ఇతర నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందనే దానిపై కూడా  పెట్ సర్వేలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఎంపిక చేసిన రూట్‌లలో ఇంజనీరింగ్‌ అంశాలపై పూర్తిగా అధ్యయనం చేశారు. హైస్పీడ్‌ రైలు కారిడార్‌లో రెండు ప్రతిపాదిత మార్గాలు ఉన్నాయి. ఆయా రూట్లలో ప్రజంట్ రాకపోకలు సాగిస్తున్న పాసింజర్స్ రద్దీని దృష్టిలో ఉంచుకొని..  భవిష్యత్‌లో హైస్పీడ్‌ ట్రైన్‌లో ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ ఎలా ఉంటుందనే అంశాలపైన కూడా పెట్‌ సర్వే నివేదికలో వివరాలు పేర్కొన్నారు. త్వరలో చేపట్టబోయే డీపీఆర్‌ సర్వేకు 8 నెలలకు పైగా సమయం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ హై స్పీడ్ ట్రైన్ కోసం నేల మీద నిర్మించిన పటిష్టమైన ట్రాక్‌లను వాడాలా, ఎలివేటెడ్‌ కారిడార్‌లను వినియోగించాలా అన్న అంశంపై నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఎలివేటెడ్‌ కారిడార్‌కే ఎక్కువమంది ఓటు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలివేటెడ్‌ కారిడార్‌ ఫైనల్ చేస్తే.. బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..