Puttaparthi Politics: గురుశిష్యుల మధ్య పోరులో.. పౌరుషాల గడ్డగా మారుతున్న ఆధ్యాత్మిక కేంద్రం..!

|

Jan 22, 2022 | 7:00 PM

నిత్యం ప్రశాంతంగా ఉండే ఆ ఆధ్యాత్మిక కేంద్రం.. పౌరుషాల గడ్డగా మారుతోంది. ఎంతో సౌమ్యంగా ఉండే నాయకులు కయ్యానికి కాలు దువ్వుతున్నారు.

Puttaparthi Politics: గురుశిష్యుల మధ్య పోరులో.. పౌరుషాల గడ్డగా మారుతున్న ఆధ్యాత్మిక కేంద్రం..!
Follow us on

Puttaparthi Politics: నిత్యం ప్రశాంతంగా ఉండే ఆ ఆధ్యాత్మిక కేంద్రం.. పౌరుషాల గడ్డగా మారుతోంది. ఎంతో సౌమ్యంగా ఉండే నాయకులు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ రంకెలు వేస్తున్నారు. మొన్నటి వరకు శ్మసానం చుట్టూ సాగిన రాజకీయాలు.. ఇప్పుడు వ్యక్తిగత సవాళ్లకు దిగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో నీపై 50వేల మెజార్టీతో గెలవకపోతే.. ఎమ్మెల్యే పదవినే త్యజిస్తానని ఒకరంటే.. అసలు డిపాజిట్ వస్తుందో లేదో చూసుకోమని మాజీ మంత్రి అంటున్నారు. ఇక్కడ మరో విశేషమేమిటంటే ఆ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గురు శిష్యులే. మరి గురు శిష్యుల మధ్య మాటల వార్ ఎందుకు వచ్చింది…

పుట్టపర్తి.. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం.. సత్యసాయి బాబా కొలువుదీరిన ఈ ప్రాంతానికి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి భక్తులు వస్తుంటారు. దీనికి ప్రధానమైన కారణం.. ఇక్కడ ప్రశాంతత ఉంటుందని. అయితే ఇంత ప్రశాంతమైన పుట్టపర్తి ఇప్పుడు రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది. ఇక్కడ రాజకీయాలు బలంగా ఉన్నా.. ఎప్పుడూ నేతలు కాంట్రవర్షీ చేసుకోరు. కానీ ఈసారి ఎందుకో అధికార ప్రతిపక్షాలు హద్దులు మీరి విమర్శలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మధ్యఫైట్ ఒక రేంజ్ లో నడుస్తోంది. వాస్తవంగా వీరిద్దరూ చాలా సౌమ్యులు.. వివాదరహితులు. కాకపోతే.. గత నెల రోజుల నుంచి వీరి మాటలు పుట్టపర్తిలో రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే.. పుట్టపర్తి పట్టణ నడిబొడ్డున ఒక స్మశాన వాటిక ఉంది. ఉన్నది చాలా తక్కువ విస్తీర్ణంలో ఉన్న స్మశానవాటిక వద్ద అర్బన్ హెల్త్ సెంటర్ నిర్వహించాలని అధికారులు భావించారు. ఇదే వివాదానికి అజ్యంపోసింది.

అయితే, ఇది ప్రజలకు ఇబ్బంది అవుతుందని మాజీ మంత్రి పల్లెతో పాటు బీజేపీ నేతలందరూ వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇందుకోసం భారీగా నిరసలు కూడా చేపట్టారు. ప్రతిపక్షాల విమర్శలపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన సహజ గుణంకి విరుద్ధంగా మంచి పనులు చేస్తే అడ్డుకుంటారా.. ఈసారి ఇక్కడ ఎవరైనా అడ్డుకుంటే.. పిడుగుద్దులు గుద్దండి.. తరిమికొట్టండంటూ పిలుపునిచ్చారు. దీంతో మాజీ మంత్రి పల్లె తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అధికార మదంతో మాట్లాడుతున్న శ్రీధర్ రెడ్డికి కళ్లు తెరిపిస్తానంటూ మండిపడ్డారు. ఇక అక్కడి నుంచి ప్రారంభమైన వార్ ఇప్పుడు పీక్ స్టేజ్‌కు చేరింది. అసెంబ్లీలో చంద్రబాబును అవమానించారని, మాజీ మంత్రి పల్లె సెంట్ మెంట్ సీన్ క్రియేట్ చేయడంతో.. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సెంటిమెంట్ కు ఆయింట్ మెంట్ కంటే ఘాటుగా రిప్లై ఇచ్చారు.

అయితే, ఆ తరువాత కూడా శ్రీధర్ రెడ్డి మాటల దాడి ఆపలేదు.. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం జగనన్నతోనే సాధ్యమన్న నినాదంతో శ్రీధర్ రెడ్డి జనంలోకి వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె పై ఒక రేంజ్‌లో ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి పల్లె సహా ఇక్కడ ప్రతిపక్ష పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న వారంతా నాన్ లోకల్ వాళ్లే అన్నారు. ప్రతి ఒక్కరికీ అన్నీ చేస్తున్నామని.. వచ్చే ఎన్నికల్లో 50 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అలా గెలవ లేకపోతే ఎమ్మెల్యే పదవి కూడా నాకు వద్దు అని తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో 30ఏళ్లుగా ఉంటున్న మాజీ మంత్రి పల్లె చేసింది శూన్యమని.. అసలు ఆయనది ఈ ప్రాంతమే కాదని.. కదిరి నుంచి వలస వచ్చారన్నారు. నేను నాన్ లోకల్ కాదని నిరూపిస్తే నా రూ.5వందల కోట్లు రాసిచ్చేస్తానని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు. అసలు పది మంది నాన్ లోకల్ నాయకులు టీడీపీలో టికెట్ కోసం కోట్లాడుతున్నారని.. వారిలో వారికి క్లారిటీ లేదన్నారు…

ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పల్లె కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఒక బచ్చా అని.. నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ లో అతను కూడా ఒకడు అంతే. అధికారం ఉందనే మదంతో మాట్లాడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో చిన్న పిల్లాడిని అడిగినా నేను ఎవరినో చెబుతారని, నీకు నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎన్ని పంచాయితీ లు ఉన్నాయో తెలుసా అని ప్రశ్నించారు. నన్ను నాన్లోకల్ అంటే నువ్వు పుట్టింది అనంతపురంలో, చదివింది. కొడిగెనహళ్లి లో, వ్యాపారాలు బెంగళూరులో చేసుకుంటున్నావు అని మండిపడ్డారు. 27 సంవత్సరాలుగా నియోజకవర్గంలో భూములు, ఇళ్లు కలిగి ఉండి ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకుంటున్నాన్నారు. నేను నాన్ లోకల్ అని నిరూపిస్తే.. నా ఆస్తులుగా చెబుతున్న రూ.2వేల కోట్ల ప్రాపర్టీస్ రాసిస్తానన్నారు.

అసలు ఇంతలా పోట్లాడుతున్న వీరి ఫైట్ లో ఇంకో ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఒకప్పుడు ప్రోఫెసర్.. ఆయన వద్ద ఇంటర్మీడియట్ లో కమెస్ట్రీ క్లాస్ లు విన్న వ్యక్తే శ్రీధర్ రెడ్డి. మరి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తరువాత గురు శిష్యులు కాస్త ప్రత్యర్థులయ్యారు. రఘునాథ్ రెడ్డి గారు నాకు గురవని.. అయితే రాజకీయాల్లోకి వస్తే ప్రత్యర్థేనంటూ శ్రీధర్ రెడ్డి. నాఊరు పుట్టపర్తి నియోజకవ్గంలోనే ఉంది. మరి నీ ఊరు ఏందంటే ఏం చెబుతావ్ అని ప్రశ్నిస్తున్నారు శ్రీధర్ రెడ్డి. నేను మళ్లీ చెబుతున్నా.. గతంలో 30వేల మెజార్టీతో గెలిచాను.. ఈ సారి 50వేలతో గెలుస్తా.. అలా గెలవకపోతే ఎమ్మెల్యే పదవిని త్యజిస్తానని స్పష్టం చేశారు…

నిన్నటి వరకు సౌమ్యంగా కనిపించిన గురు శిష్యులు ఇప్పుడు రాజకీయ శత్రువులుగా మారిపోవడం.. నియోజకవర్గంలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అసలు సమయం సందర్భం లేకుండా వీరు చేసుకుంటున్న సవాళ్లు, ప్రతి సవాళ్లు మాత్రం ఆధ్యాత్మిక క్షేత్రంలో వేడి పుట్టిస్తున్నాయి…

—-లక్ష్మీకాంత్ రెడ్డి, టీవీ 9, ప్రతినిధి, అనంతపురం.

Read Also….   Crime News: నడిరోడ్డుపై యువకుడి గొంతు కోసి హతమార్చేందుకు యత్నం.. పోలీసుల ఏంట్రీతో అసలు నిజం..!