మానవమేదో వికాసానికి.. దేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి అత్యుత్తమ కీర్తి చంద్రిక. అసమానమైన రాతి కట్టడంగా రూపు దాల్చిన శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీక.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు. తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేసిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువలకు నీటిని విడుదల చేసి నేటికీ 56 నిండాయి. సరిగ్గా 56 ఏళ్ల క్రితం ఈ ఆధునిక దేవాలయాన్ని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ జాతికి అంకితం చేశారు. కరువు కాటకాలతో అల్లాడుతున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా పైరు పచ్చలతో సింగారించేందుకు సాగునీటి ప్రాజెక్టు అవసరమని భావించి నల్లగొండ జిల్లా నందికొండ వద్ద కృష్ణానదిపై ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి పాలకులు నడుం బిగించారు. ఇంతటి అపురూపమైన ఈ ప్రాజెక్టుకు 68 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1955 డిసెంబర్ 10వ తేదీన నాగార్జునసాగర్ వద్ద శంకుస్థాపన చేశారు.
అప్పటినుంచి రోజుకు 45 వేల మంది 12 ఏళ్ల పాటు శ్రమించారు. మొత్తం 19 కోట్ల 71 లక్షల మంది ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకుని ప్రపంచంలోనే అతి పెద్ద మానవ నిర్మితమైన కట్టడాన్ని ఆవిష్కరించారు. దీన్ని 1964లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కాలువలకు నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేశారు. 1955 డిసెంబర్ 10న నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేయగా 12సంవత్సరాల అనంతరం ఆయన కుమార్తె ఇందిరాగాంధీ సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం విశేషం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు లక్షలాది ఎకరాలకు సాగునీరు వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా కుడి ఎడమ కాలువల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో 22 లక్షల ఎకరాలు సాగవుతోంది.
ఆనాడు కుడి ఎడమ కాలవల ద్వారా నీళ్లు రావడాన్ని చూసిన రైతులు ఆనందంతో తన్మయత్వం చెందారు. అప్పటినుంచి తెలుగు రాష్ట్రాల్లో రైతులు సిరులు పండించుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు వల్లే అన్నం మెతుకులు తింటున్నామని దేశానికి అన్నం పెడుతున్నామని ఆయకట్టు రైతులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును ఆయకట్టు రైతులు దేవాలయంగా భావిస్తుంటారు. ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన నాటి నుంచి ఎక్కువ సంవత్సరాల్లో ఆయకట్టుకు ఆగస్టులోనే నీటిని విడుదల చేశారు. ఈసారి కూడా ఎగవ కృష్ణ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు నాగార్జునసాగర్ కు వరద నీరు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాది కూడా ఆగస్టులోనే నీటి విడుదల చేయవచ్చని.. రైతుల ఆశలు చిగురిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..