ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో విశాఖ రాబోతున్నారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ సైతం స్టీల్ సిటీకి వెళుతున్నారు. కారణం ప్రధానితో భేటీ. అవును మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అవుతుండటం ఏపీలో రాజకీయ ఆసక్తిని ఒక్కసారిగా పెంచేసింది. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగబోతున్న వేళ పొలిటికల్‌గా వీరిద్దరి భేటీ ఎన్నో ఊహాగానాలు, మరెన్నో చర్చలకు దారితీస్తోంది. విశాఖ ఈస్ట్రన్ నేవీ పరిధిలోని INS చోళ అతిథి గృహంలో రాత్రి 8.30 గంటలకు వీరిద్దరి సమావేశం ఉంటుంది. ఇతర నేతలు లేకుండా ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ ఇద్దరే చర్చలు జరుపుతారని తెలుస్తోంది.
2024 ఎన్నికల్లో వైసీపీ ఓటును చీలనివ్వబోమని పదే పదే చెబుతున్నారు పవన్ కల్యాణ్. అంటే 2014 తరహాలోనే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలనే ఆలోచనలో పవన్ ఉన్నారు. దీనిపై ఇప్పటికే ఆయన మూడు ఆప్షన్లను సైతం ఇచ్చారు. కానీ బీజేపీ అధిష్టానం తనకు రోడ్ మ్యాప్ ఇవ్వడం లేదంటూ అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు టైం దగ్గర పడుతోంది కాబట్టి వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో ఇటీవల విశాఖ ఘటన తర్వాత పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు కలిసి పరామర్శించడం మరింత ఆసక్తిగా మారింది. ఈ పరిణామాల తర్వాత బీజేపీ అధిష్టానం సైతం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే 8 ఏళ్ల తర్వాత మోదీని పవన్ కలవడం చర్చనీయాంశమైంది. 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పని చేసినప్పుడు మోదీని కలిశారు పవన్ కల్యాణ్. ప్రచార సభల్లోనూ కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత 2016లో ప్రత్యేక హోదాపై బీజేపీని విమర్శించారు. 2019లో బీజేపీకి దూరంగా జరిగి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత మళ్లీ 2020లో కమలం పార్టీతో దోస్తీ మొదలు పెట్టారు జనసేన అధ్యక్షుడు. 2016 నుంచి ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో పవన్ కల్యాణ్ రాజకీయ కామెంట్లు ఏంటో ఒకసారి చూద్దాం.
2024 ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ తాజా అడుగులు, కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి. ప్రధాని మోదీతో భేటీలో తాజా పరిణామాలను చర్చించి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారా? అనే చర్చ జరుగుతోంది. టీడీపీని మళ్లీ బీజేపీకి దగ్గర చేసేందుకే ఈ భేటీ అని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇలా వీరిద్దరి భేటీపై రియాక్షన్స్ గట్టిగానే వస్తున్నాయి. ప్రధానిని పవన్ ప్రశ్నించాలని వామపక్షాలు డిమాండ్ చేస్తుంటే, చంద్రబాబు కోసమే పవన్ తాపత్రయమని వైసీపీ విమర్శిస్తోంది. మరోవైపు మోదీ, పవన్ భేటీతో వైసీపీకి భయం పట్టుకుందని కామెంట్ చేస్తోంది టీడీపీ. ఇంతకీ ఏం జరుగుతుందో అనేది తెలియలంటే.. ముందు వారి భేటీ పూర్తవ్వాలి. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..