Vegetables Price Today: బాబోయ్.. కూరగాయల ధరలు మస్తు పిరం! ఇలా అయితే బతికేదెలా?

|

Oct 08, 2024 | 9:39 AM

నిత్యావసర వస్తువులను కొనాలంటేనే సామాన్యుడు బెంబేలెత్తి పోతున్నాడు. బియ్యం, పప్పు ఉప్పులు.. వేటి ధరలు చూసినా అందనంత దూరంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ నింగినంటుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలను చూసి సామాన్యులు హడలెత్తిపోతున్నారు. మేలో ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం..

Vegetables Price Today: బాబోయ్.. కూరగాయల ధరలు మస్తు పిరం! ఇలా అయితే బతికేదెలా?
Vegetables Price
Follow us on

నిత్యావసర వస్తువులను కొనాలంటేనే సామాన్యుడు బెంబేలెత్తి పోతున్నాడు. బియ్యం, పప్పు ఉప్పులు.. వేటి ధరలు చూసినా అందనంత దూరంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ నింగినంటుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలను చూసి సామాన్యులు హడలెత్తిపోతున్నారు. మేలో ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం అన్ని వస్తువుల ధరలు 30 నుంచి100 శాతం మేర పెరిగాయి. వరదలు, వర్షాల సాకుతో కూరగాయల వ్యాపారులు, సుంకాలు పెరిగాయంటూ నిత్యావసరాల వ్యాపారులు అడ్డగోలుగా ధరలు పెంచేశారు. రిటైల్‌ మార్కెట్‌లో నాలుగు నెలల క్రితం కిలో రూ.28 ఉన్న టమోటాల ధర.. ప్రస్తుతం రూ.100కు చేరింది. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ వంటి ప్రధాన నగరాల్లో రిటైల్‌ మార్కెట్‌లో రూ.100 నుంచి రూ.110 మధ్య పలుకుతోంది. గతేడాది ఇదే సీజన్‌లో మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో టమోటా ధరలు ఒక్కసారిగా వంద దాటిపోయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం అనంతపురం, గుంటూరు, విశాఖపట్నం, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని ఎంపిక చేసిన కొన్ని రైతుబజార్లలో మాత్రమే సరఫరా చేస్తున్నారు. అది కూడా రూ.70కి పైగానే. ఇక కిలో రూ.25 ఉన్న ఉల్లి ప్రస్తుతం రూ.70 -80 వరకు విక్రయిస్తున్నారు. బంగాళదుంపలు మినహా మిగిలిన కూరగాయలన్నీ కిలో రూ.70 పైమాటగానే ఉన్నాయి. మూడు నెలల క్రితం రూ.10కు దొరికిన కొత్తిమీర కట్ట సైతం రూ.50-60 ఉంది. ఐదు కట్టలు రూ.20కు దొరికే ఆకుకూర ఏదైనాసరే కట్ట రూ.10కు తక్కువకు దొరకడంలేదు. మొత్తం మీద రూ.150-200 పెడితే బ్యాగ్‌ నిండే కూరగాయల కోసం ఇప్పుడు రూ.500-600 పెట్టాల్సి వస్తోంది. దీంతో కూరగాయలు కొందామంటే భయమేస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టమోటా రూ.100 దాటిపోయింది. రైతుబజార్లలో కూడా కిలో రూ.75కు తక్కువగా ఇవ్వడంలేదు. పైగా ఎక్కడా సరుకు ఉండడంలేదు. బహిరంగ మార్కెట్‌లో ఉల్లి నుంచి కొత్తిమీర వరకు అన్ని ధరలు చుక్కలనంటుతున్నాయి.

కిలో రూ.20-30లకు వచ్చే బెండ, వంకాయలకు సైతం ప్రస్తుతం కిలో రూ.80కు పైగా పెట్టాల్సి వస్తోంది. కూరగాయ ఏదైనాసరే రూ.80కి తక్కువకు రావడం లేదు. బియ్యం, నూనె ధరలు అమాంతం పెరిగిపోయాయి. ధరల నియంత్రణను ప్రభుత్వం గాలికొదిలేసినట్లుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో కూరగాయలే కాదు.. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన నాలుగు నెలలుగా విపరీతంగా పెరిగాయి. ఆయిల్, పప్పుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సన్‌ఫ్లవర్‌ ఆయిల్స్‌ లీటర్‌కు రూ.25కు పైగా పెరిగాయి. పప్పుల ధరలు కూడా నాణ్యతను బట్టి కిలోకు రూ.30 వరకు పెరిగిపోయాయి. చికెన్‌ కూడా కిలో రూ.240 దాటిపోయింది. ధరలు పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.