AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఎంత కష్టమొచ్చే.. గర్భిణీకి పురిటి కష్టాలు.. 3 కి.మీ. మోసుకెళ్లిన గ్రామస్థులు..

మారుమూల ఏజెన్సీ పల్లెల్లో గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు. కాన్పు నొప్పులతో ఓ నిండు గర్భిణి విలవిల్లాడుతున్నా.. గ్రామానికి రోడ్డు లేక అంబులెన్స్ రాలేకపోయింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రాళ్లు, రప్పల దారుల్లో ఆ గర్భిణిని ఏకంగా 3 కిలోమీటర్ల మేర డోలీపై మోసుకుంటూ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Andhra Pradesh: ఎంత కష్టమొచ్చే.. గర్భిణీకి పురిటి కష్టాలు.. 3 కి.మీ. మోసుకెళ్లిన గ్రామస్థులు..
Pregnant Woman Carried On Doli
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Oct 30, 2026 | 7:47 PM

Share

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ పరిధిలో గర్భిణీకి పురిటి కష్టాలు ఎదురయ్యాయి. పురిటి నొప్పులతో విలవిల్లాడుతున్న ఓ నిండు గర్భిణిని ఆసుపత్రికి చేర్చేందుకు స్థానికులు ఏకంగా మూడు కిలోమీటర్ల మేర రాళ్లురప్పల దారుల్లో డోలీ మోయాల్సి వచ్చింది. అనంతగిరి పంచాయతీ కేంద్రానికి సమీపంలోని తల్లారిపాడు గ్రామానికి చెందిన కొందు గిరిజన మహిళ నీలిమ నిండు గర్భిణి. శుక్రవారం తెల్లవారుజామున ఆమెకు ఒక్కసారిగా తీవ్రమైన ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. పరిస్థితి విషమిస్తుండటంతో ఆసుపత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేసినా, గ్రామానికి సరైన రహదారి మార్గం లేకపోవడంతో వాహనం వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.

చేయి చేయి కలిపి.. 3 కిలోమీటర్ల డోలీ ప్రయాణం

పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణి పరిస్థితిని చూసి చలించిపోయిన గ్రామస్తులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చేయి చేయి కలిపారు. కర్రలు, దుప్పటితో స్ట్రెచర్‌లాంటి డోలీని సిద్ధం చేశారు. అందులో నీలిమను పడుకోబెట్టుకుని, కొండలు, గుట్టలు, రాళ్లురప్పలతో కూడిన దుర్భరమైన కాలిబాట మీదుగా దాదాపు మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన మోసుకుంటూ పొర్లుబంద గ్రామానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఒక ప్రైవేట్ ఆటోలో ఆమెను లుంగపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

మధ్యలోనే నిలిచిన పనులు.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

తమ గ్రామానికి రోడ్డు నిర్మాణానికి గతంలో నిధులు మంజూరైనప్పటికీ, అవి సకాలంలో విడుదల కాకపోవడంతో పనులను కాంట్రాక్టర్లు అర్ధాంతరంగా నిలిపివేశారని గిరిజనులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా ఇలాంటి అత్యవసర సమయాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోగులను, గర్భిణులను మోయాల్సి వస్తోందని కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి తమను రక్షించాలని తల్లారిపాడు గ్రామస్తులు వేడుకుంటున్నారు.

వీడియో చూడండి..

Follow Us