Eluru District: 50 కిలోల అచ్చమైన కారంతో స్వామీజీకి అభిషేకం.. చర్చనీయాంశంగా మారిన ఘటన

|

Nov 14, 2022 | 3:26 PM

కూరల్లో కారం కొంచెం ఎక్కువైనా.. చేతికి గాయం అయితే.. దానికి కారం తగిలినా అల్లాడిపోతాం.. అలాంటిది ఓ పూజారికి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 50 కేజీల కారంతో అభిషేకం చేశారు. ఎక్కడా ఏంటో తెలుసుకుందాం పదండి.

Eluru District: 50 కిలోల అచ్చమైన కారంతో స్వామీజీకి అభిషేకం.. చర్చనీయాంశంగా మారిన ఘటన
Swamy Anointed With Chili Powder
Follow us on

మీరు చదివింది నిజమే.. అచ్చమైన కారంతోనే అభిషేకం. పూలతోనో, పాలతోనో, పంచామృతాలతోనో అభిషేకం అన్ని చోట్లా జరిగేదే.. కానీ ఇక్కడ కారాభిషేకానికి ఓ ప్రత్యేక ఉందట. మొదట స్వామిజీకి స్నానం చేయిస్తారు. పూనకంతో ఉన్న ఆ స్వామికి దూపం వేసి కూర్చోబెడతారు..ఆ తరువాత అసలు తతంగం మొదలవుతుంది. ప్రత్యంగిరా మాత ఆవాహనతో శివస్వామి ఉన్నప్పుడు.. భక్తులు ఆయనకు ఇలా కారంతో అభిషేకం చేశారు. ఓం నమశ్శివాయ అంటూ శివనామస్మరణ చేస్తూ స్వామి శరీరంపై కారం చల్లారు. ఆంధ్రాలోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల దొరసానిపాడు గ్రామంలో ఈ వింత అభిషేకం జరిగింది.

ఇక్కడ శివదత్తాత్రేయ ప్రత్యంగరి వృద్ధాశ్రమం ఉంది. అక్కడ ఈ హోమాన్ని, విశేష పూజల్ని నిర్వహించారు. ఈ ప్రత్యంగిరా దేవికి చాలా ప్రత్యేకత ఉందని పండితులు చెప్తున్నారు. హిరణ్యకసిపుడిని నరసింహస్వామి వధించిన తర్వాత ఆ స్వామివారి ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు ఈ ప్రత్యంగిరాదేవి ఉద్భవించారని పురాణాల్ని వివరిస్తున్నారు. అందుకే ఈ పూజల్లో ఎండు మిరపకాయలు, కారం లాంటివి ఉపయోగిస్తారంటున్నారు. ఇలా కారంతో అభిషేకం చేస్తే దుష్టశక్తులు, దురదృష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. భక్తులు కారం అభిషేకం చేస్తున్న సమయంలో స్వామిజీ కదలడు, మెదలడు. ఉలకడు.. పలకడు. అభిషేకం నిర్వహించినంత సేపు భక్తులు తన్మయత్వంతో పరవశించిపోతారు. అంతా దేవుడి మహిమ అంటారు.

హైదరాబాద్‌లోని ప్రత్యంగిరా అమ్మవారి దేవాలయంలో మాత్రం మిరపకాయలు, ఆవాలు, మిరియాలు సహా పలు ఘాటైన పదార్ధాలతో హోమాలు జరుగుతాయంటున్నారు పూజారులు, నిర్వహాకులు. ఈ తరహా కారాభిషేకాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..గతంలో తమిళనాడు, కర్నాటకలో కూడా నిర్వహించారు. ధర్మపురి జిల్లాలో ఓ పూజారికి ఏకంగా 75 కేజీల కారం పొడిని నీటిలో కలిపి అభిషేకం చేశారు. నల్లంపల్లిలో కరుప్పుస్వామి ఆలయంలో ఆడి అమావాస్య సందర్భంగా ఈ అభిషేకం నిర్వహించారు. ఏటా ఈ కార్యక్రమం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోందంటున్నారు స్ధానికులు. ఇలా కారంతో అభిషేకం చేస్తే దెయ్యాలు, భూతాలు, ఆత్మలు ఆ ఊరిని వీడిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే ఇలాంటివి నిర్వహిస్తున్నామంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..