Andhra Pradesh: పోలీసుల కారు బీభత్సం.. డిక్కీలో గంజాయి, మద్యం బాటిళ్లు.. అసలు ఏం జరిగిందంటే..?
ఒక రోడ్డు ప్రమాదం.. వందలాది సందేహాలు.. సాధారణంగా యాక్సిడెంట్ జరిగితే కేసులు పెట్టి విచారించాల్సిన పోలీసులే ఇక్కడ స్వయంగా ప్రమాదానికి కారణమయ్యారు. అంతటితో ఆగకుండా, ప్రమాదానికి గురైన ఆ పోలీసుల కారులో మద్యం సీసాలు, ఏకంగా గంజాయి, అనుమానాస్పద బ్యాగు బయటపడటం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తుంది.

ఒక ప్రమాదం… వంద అనుమానాలు… సాధారణంగా ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు… అలాంటిది ఆ యాక్సిడెంట్ చేసింది పోలీసులే అయితే… అందులో యాక్సిడెంట్ చేసిన కారులో మద్యం, గంజాయి ఉంటే ఏం అనుకోవాలి.. పోలీసులు మద్యం తాగి కారు నడిపడం వల్లే ప్రమాదం జరిగిందని భావించాలా..? అంతకు మించి పోలీసులు ప్రయాణించిన కారు డిక్కీలో గంజాయి ఉంటే ఇక కలకలమే.. సరిగ్గా ప్రకాశం జిల్లా శంఖవరప్పాడు దగ్గర ఇద్దరు ఎస్‌ఐలు ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఇలాంటి అనుమానాలు, ఆరోపణలే వెల్లువెత్తాయి. అయితే ఇవన్నీ ఒట్టి అనుమానాలేనని, కారులో ఉన్న గంజాయి ఓ కేసుకు సంబంధించిందని పోలీసులు వివరిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనలో కారు నడిపిన పోలీసులకు రక్తపరీక్షలు ఎందుకు చేయలేదని, గంజాయితో పాటు కారులో ఉన్న బ్యాగులో నగదు ఉందన్న అనుమానాలు ఉన్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసుల కారు యాక్సిడెంట్ ఘటన ఇటు పోలీసు వర్గాల్లో, అటు రాజకీయవర్గాల్లో తీవ్రచర్చకు దారి తీసింది.
అసలేం జరిగిందంటే..
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరప్పాడు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. సంతమాగులూరు ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు, బల్లికురవ ఎస్‌ఐ నాగరాజులు ప్రయాణిస్తున్న కారు ఓ బైక్‌ను ఢీకొట్టి ఆ తరువాత ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కారు నుంచి బయటకు దిగిన ఇద్దరు ఎస్‌ఐలు 108కి ఫోన్ చేసి క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అద్దంకి ఎస్‌ఐ సాయి ఘటనా స్థలానికి చేరుకుని కారును స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో అప్పటికే అక్కడ గుమిగూడిన గ్రామస్థులు కారును సోదా చేశారు. కారులో మద్యం బాటిళ్ళు, డిక్కీలో గంజాయి, పోలీసు యూనిఫాంలు కనిపించాయి… అలాగే ఓ నీలిరంగు బ్యాగు కూడా ఉంది. ఆ బ్యాగులో డబ్బులు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అదే సమయానికి అద్దంకి సీఐ సుబ్బారాజు కూడా ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఉన్న మద్యం, గంజాయిలను సెల్‌ఫోన్లో చిత్రీకరిస్తున్న యువకులను వారించారు. దీంతో కొద్దిసేపు పోలీసులకు, గ్రామస్థులకు వాగ్వివాదం జరిగింది. మద్యం మత్తులో పోలీసులు కారు నడిపి యాక్సిడెంట్ చేశారని అనుమానాలు వ్యక్తం చేశారు. అనంతరం ప్రమాదానికి గురైన వాహనాలను పోలీసులు అక్కడి నుంచి పీఎస్‌కు తరలించారు…
ఆ తరువాతే అసలు కధ మొదలైంది..
ఈ ప్రమాదం జరగడానికి ముందు బల్లికురవలో దర్శి డీఎస్పీ ఆధ్వర్యంలో అద్దంకి టౌన్ సీఐ, రూరల్ సీఐ, సంతమాగులూరు సీఐ, ఎస్సైలు ఇతర సిబ్బంది కలిసి పెద్ద ఎత్తున దావత్ చేసుకున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఆ పార్టీ ముగించుకుని తిరిగి బయలుదేరి వచ్చే క్రమంలో, కారు నడుపుతున్న వ్యక్తి పూర్తిగా మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని గ్రామస్తులు అనుమానించారు. ఆ సమయంలో కారులో సంతమాగులూరు ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు, బల్లికురవ ఎస్‌ఐ నాగరాజు ఉన్నట్టు గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఘటనా స్థలంలో ఉన్న ఇద్దరు ఎస్‌ఐలు వేరే వాహానాల్లో ఆసుపత్రికి తరలించారు.
గ్రానైట్ అక్రమ వ్యాపారులతో ప్రకాశం, పల్నాడుజిల్లాల పోలీసుల దావత్..
అద్దంకి మండలం శంఖవరప్పాడు గ్రామం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై అద్దంకి వైసీపీ ఇన్‌చార్జి డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి తీవ్ర విమర్శలు చేశారు. బల్లికురవ గంగమ్మ గుడి దగ్గర గ్రానైట్ అక్రమ వ్యాపారులతో పల్నాడు, ప్రకాశంజిల్లాలకు చెందిన పలువురు సీఐలు, ఎస్‌ఐలు సమావేశమయ్యారని ఆరోపించారు. గ్రానైట్ రాళ్లను అక్రమంగా తీసుకెళ్ళేందుకు వ్యాపారులతో ఒప్పందం చేసుకునేందుకే వ్యాపారులు ఇచ్చిన దావత్‌లో పోలీసులు పాల్గొన్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది కేవలం సాధారణ ప్రమాదంగా వదిలేయాల్సిన విషయం కాదని, దీని వెనుక పెద్ద తతంగమే ఉందని ఆయన ఆరోపించారు. ప్రమాదానికి గురైన కారును స్థానికులు పరిశీలించగా, అందులో మద్యం బాటిళ్లతో పాటు షాకింగ్‌గా గంజాయి బయటపడిందని డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. అక్కడ వీడియోలు, ఫోటోలు తీస్తున్న స్థానికులను అద్దంకి సీఐ బెదిరింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. రాష్ట్రంలో గంజాయి లేని ఆంధ్రప్రదేశ్ సృష్టిస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసుల కారులో గంజాయి లభ్యం కావడాన్ని ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. కారులో ఉన్న ఎస్సైలపై, ప్రజలను భయపెడుతున్న అద్దంకి సీఐపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..
