Prakasam district: గుడి శిధిలం… ధ్వజస్థంభం పదిలం…

ఆలయం శిథిలమైనా పూజలందుకుంటున్న ఓ ధ్వజస్తంభం ప్రకాశం జిల్లాలో భక్తులను ఆకట్టుకుంటోంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మితమైన జనార్ధనస్వామి ఆలయానికి చెందిన ఈ ధ్వజస్తంభాన్ని వందల ఏళ్లుగా ఓ మర్రిచెట్టు తన శాఖలతో పెనవేసుకుని కాపాడుతోంది. ఆలయం లేకపోయినా ఈ ధ్వజస్తంభానికి నేటికీ భక్తులు పూజలు చేయడం విశేషం.

Prakasam district:  గుడి శిధిలం... ధ్వజస్థంభం పదిలం...
Sacred Banyan Tree Worship

Edited By:

Updated on: Jan 07, 2026 | 9:54 PM

శ్రీకష్ణదేవరాయలు కట్టించిన గుడి శిథిలమైంది. అయితే ధ్వజస్తంభం మాత్రం ఇంకా ఠీవీగా నిలబడే ఉంది. ధ్వజస్థంభానికి బాసటగా నేనున్నానంటూ వందల ఏళ్లుగా ఓ మర్రిచెట్టు తన శాఖలతో పొదివి పట్టుకుని కాపాడుకుంటూ వస్తోంది. ఆలయం శిథిలమవడంతో మూలవిరాట్‌ను మరో చోటికి తరలించి గుడి కట్టించారు గ్రామస్థులు. అయితే మర్రిచెట్టుకు పెనవేసుకుపోయిన ధ్వజస్తంభాన్ని తాకాలంటే చెట్టును నరకాల్సి రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని అలాగే వదిలేశారు. ప్రస్తుతం మర్రిచెట్టు పెనవేసుకున్న ధ్వజస్థంభానికి భక్తులు పూజులు చేస్తుండటం విశేషం.

ఆలయం లేకున్నా పూజలందుకుంటున్న ధ్వజస్తంభం…

ప్రకాశం జిల్లా కందుకూరు మండలం జిల్లెలమూడి గ్రామ సమీపంలో జనార్ధనస్వామి ఆలయం ఉండేది… శ్రీకృష్ణదేవరాయల కాలంలో పాలేరు ఒడ్డున ఈ ఆలయాన్ని నిర్మించారు… కాలక్రమేణ ఆలయం శిధిలం కావడంతో మూలవిరాట్టును మరో ప్రాంతానికి తరలించి అక్కడ గుడికట్టారు గ్రామస్థులు… అయితే ఆలయ ధ్వజస్తంభం మాత్రం ఇంకా అక్కడే ఉంది… ఆలయం శిథిలమైనా.. అప్పటి ధ్వజస్తంభం మాత్రం చెక్కుచెదరకుండా ఇంకా పూజలు అందుకుంటూనే ఉంది… ధ్వజస్తంభం చుట్టూ ఓ మర్రి చెట్టు ఇమిడిపోయి వందల ఏళ్లుగా అలా ఉండిపోయింది… ఆలయం లేకపోయిన భక్తులు, గ్రామస్థులు ఈ ధ్వజస్థంభాన్ని సందర్శించి నేటికీ పూజలు చేస్తున్నారు…

మర్రిచెట్టును నరకడం ఇష్టంలేక ధ్వజస్తంభాన్ని వదిలేశారట…

భారతదేశపు జాతీయ వృక్షమైన వట వృక్షాన్ని నరికి జనార్ధనస్వామి ఆలయ ధ్వజస్తంభాన్ని బయటకు తీయడం ఇష్టంలేక అలాగే వదిలేశారట గ్రామస్థులు. మర్రిచెట్టుగా సామాన్యులు పిలుచుకునే వటవృక్షాన్ని హిందువులు పవిత్రంగా భావించి పూజలు చేయడమే ఇందుకు ప్రధాన కారణం… హిందువులకు పవిత్రమైన ఈ చెట్టును దేవతలు, మునులు పూజిస్తారని ప్రతీతి… ప్రళయకాలంలో శ్రీమహావిష్ణువు మర్రి ఆకుపై కనిపించాడని పురాణాలు చెబుతాయి… దీంతో ఈ చెట్టును నరకాలంటే ఇష్టంలేని గ్రామస్థులు దాన్ని పెనవేసుకుని ఉన్న జనార్ధనస్వామి ధ్వజస్థంభాన్ని అలాగే వదిలేశారు… అదీ కధ… ఆలయం లేకుండా ధ్వజస్తంభం ఎందుకు ఉందబ్బా అని ఆశ్చర్యంతో చూసే సందర్శకులకు అక్కడి స్థానికులు వివరంగా వినిపించే అసలు కథ.