
జల్సాలకు అలవాటు పడ్డ ఓ అల్లుడు బంగారు నగల కోసం అత్తను హత్య చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తన ప్రియురాలితో కలిసి అత్తపై దాడి చేసి దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలతో ఉడాయించారు. చేసిన పాపం ఊరికేపోదు అన్నట్టుగా.. పోలీసుల విచారణలో అసలు నిజం బయటకు వచ్చింది.. అల్లుడే హంతకుడిగా గుర్తించిన పోలీసులు నిందితులను పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. వివరాల ప్రకారం.. ప్రకాశంజిల్లా చీమకుర్తికి మండలం గంగవరం రోడ్డులో నివాసం ఉంటుర్న షేక్ మీరాబీ ఈనెల 21వ తేదిన సాయంత్ర ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె చిన్నల్లుడు షేక్ మస్తాన్‌వలి, అతని ప్రియురాలు ఇంట్లోకి చొరబడ్డారు. మీరాబీ భర్త ఇంట్లో లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న ఇద్దరు నిందితులు మీరాబీపై దాడికి పాల్పడ్డారు. అనంతరం దిండును ముఖంపై బలంగా అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.
ఆ తర్వాత.. ఆమె చెవులకు ఉన్న రెండు బంగారు కమ్మలు, ఒక బంగారు గొలుసును దోచుకుని పరారయ్యారు. మీరాబీ భర్త షేక్ మీరావలి ఇచ్చిన ఫిర్యాదుతో చీమకుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనుమానితుల కదలికలపై నిఘా పెట్టారు.
పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలి చిన్న అల్లుడు షేక్ మస్తాన్ వలి, అతనితో వివాహేతర సంబంధం నడుపుతున్న కుమారి అనే మహిళ కలిసి ఈ హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇద్దరూ జల్సాలకు అలవాటుపడి డబ్బుల కోసం మీరాబీ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలపై కన్నేసినట్లు పోలీసులు తెలిపారు. ఆభరణాలను తాకట్టు పెట్టేందుకు ఇవ్వాలని అత్త మీరాబీని అల్లుడు మస్తాన్‌వలి అడగడంతో ఆమె నిరాకరించిందన్న కోపంతో ఆమెను హత్య చేసి అనంతరం బంగారు నగలు ఎత్తుకెళ్ళినట్టు పోలీసులు నిర్ధారించారు. చిన్నల్లుడు మస్తాన్‌వలిపై నిఘా పెట్టిన పోలీసులు దోచుకున్న బంగారు ఆభరణాలను విక్రయించేందుకు వెళ్తుండగా ఎర్రగుడిపాడు అడ్డరోడ్డు దగ్గర నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్టు చేసి.. మీరాబీకి చెందిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..