కందుకూరు ఘటనపై డీజీపి రాజేంద్రనాధ్ రెడ్డి కి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ను పోలీసులు అడ్డుకున్నారు. అపాయింట్మెంట్ లేదని ఆఫీస్ లోపలికి పంపించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో పోలీసుల తీరుపై కేఏ పాల్ ఫైర్ అయ్యారు. రాష్ట్రం రావణ కాష్టంగా మారిపోయిందిని ఆరోపించారు. డీజీపీకి సమాచారం ఇచ్చినా రాలేదన్న కేఏ పాల్.. తనను, తన వాహనాన్ని అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ డిక్టేటర్ లా తయారు అయ్యారని విమర్శించారు. ఇక్కడ ఆంధ్రాలో కూడా డిక్టేటర్లు తయారయ్యారని ఆక్షేపించారు. లక్షలాది మంది ప్రజలతో వందలాది మీటింగ్స్ పెట్టినా.. ఏ రోజు కూడా ఒక్కరు కూడా చనిపోలేదని కేఏ పాల్ వివరించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశాలకు ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు దీనికి బాధ్యత వహించి టీడీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు.
మానవత్వం లేని చంద్రబాబుని అరెస్టు చేయాలి. చనిపోయిన వాళ్లు నా కుటుంబ సభ్యులు అని అంటున్న చంద్రబాబు.. ఇదే మీ ఇంట్లో మనుషులు చనిపోతే సభలు పెడతావా. ఈ ఘటనపై కోర్టుకు వెళ్తాను. రండి కలిసి పోరాడతాం. రోడ్డు షోలో 8 మంది మృతికి కారణమైన చంద్రబాబుపై కేసు నమోదు చేయాలి. వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలి. డబ్బులు, మందు, బిర్యానీ పంచి ప్రజలను తీసుకొచ్చి రెండు వేల మంది పట్టే స్థలంలో సభ పెట్టి 8 మందిని బలితీసుకున్న చంద్రబాబుపై కేసు ఎందుకు నమోదు చేయరు.
– కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు
కాగా.. కందుకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రోడ్ షో లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. ఘటనపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులు చనిపోవడం బాధకరమంటూ పేర్కొన్నారు. బాధితులకు అన్ని విధిలా అండగా ఉంటామని తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి