
తమిళనాడు రాష్ట్రం పశ్చిమ కనుమలలోని నీలగిరి కొండల్లో ఉండే ఊటీ చల్లదనానికి ఒక ప్రతీక. సముద్ర మట్టానికి చాలా ఎత్తులో అందమైన కాఫీ తోటలతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉండే ఈ ప్రాంతం అందరినీ ఆకట్టుకుంటుంది. అందుకే చాలమంది టూరిస్ట్ లు వేసవి విడిదిగా ఊటీ ని ఎంచుకుంటారు. అంతేకాదు వేరే ప్రాతం ఏదైనా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటే ఆ ప్రాంతాన్ని సాధారణంగా ఊటీ తోనే పోలుస్తారు. అదే క్రమంలో ఉత్తరాంధ్ర లోని శ్రీకాకుళం జిల్లా కేంద్రాన్ని పేదల ఊటీగా పిలుస్తారు.
శ్రీకాకుళం జిల్లా కేంద్రం సముద్ర తీరానికి సమీపంలోనే ఉంటుంది. అంతేకాదు నగరానికి ఒక మణిహారంలా శ్రీకాకుళం నగరం గుండానే నాగావళి నది ప్రవహిస్తూ ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం చుట్టూ ఉండే పచ్చని పొలాలు,పల్లె వాతావరణం శ్రీకాకుళంకి వచ్చే వారిని ఆకట్టుకుంటుంది. అంతేకాదు వేసవి కాలంలో సాయంత్రం అయితే చాలు సముద్ర తీరం నుంచి వీచే గాలులకు శ్రీకాకుళంలో వాతావరణం త్వరగా చల్లబడుతుంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే వాతావరణం ఇక్కడ కాస్త చల్లగా ఉంటుంది. ఇకపోతే ఉపాధి దొరక్క ఇక్కడి వారు వివిధ ప్రాంతాలకు వలస వెళుతూ ఉంటారు. అందుకే ఇక్కడ పేదరికమూ ఎక్కువే. అయితే ఉన్నంతలో వేసవిలో కాస్త చల్లగా ఉండటం చేత శ్రీకాకుళం నగరానికి పేదల ఊటీ అని స్థానికులు పిలుచుకుంటూ ఉంటారు.అయితే పేరుకు తగ్గట్టుగానే శ్రీకాకుళంలో గత మూడు రోజులుగా వాతావరణం నిజమైన ఊటిని తలపిస్తుంది. దిత్వా తుఫాన్ ప్రభావంతో సోమవారం జిల్లాలో ఓ మోస్తరు వర్షం పడి ముసురు వాతావరణం అలుముకోగా…గత రెండు రోజులుగా మాత్రం ఎక్కడ చుక్క చినుకు పడలేదు. వాతావరణం చేస్తే చినుకులు పడతాయన్న పరిస్థితి ఎక్కడ కనిపించలేదు.
కానీ గత రెండు రోజులుగా సూర్యుడు అస్సలు కనిపించలేదు. ఉదయం 6గంటల నుంచి పొద్దుపోయే వరకు రోజంతా ఒకేలాంటి వాతావరణం కొనసాగింది. అసలే శీతాకాలం కావడం సూర్యుడు జాడ ఎక్కడ కనిపించకపోవడంతో ఆహ్లాదకరమైన వాతావరణం అందరినీ ఆకట్టుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల సమయంలో కూడా పొగమంచు అలుముకున్నట్టు వాతావరణం ఊటీ నీ తలపించేలా ఉంది. దీంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సిక్కోలు వాసులు తమ దైనందిన పనులను చేసుకున్నారు. అయితే ఆస్తమా, కోల్డూ ఉన్నవారు మాత్రం ఈ వాతావరణంతో కాస్త ఇబ్బంది పడ్డారు.