Thopudurthi Prakash Reddy : అజ్ఞాతంలో తోప్.. వెంటాడుతోన్న కాప్..

పాపిరెడ్డిపల్లి వైఎస్ జగన్ పర్యటనలో హెలిప్యాడ్ దగ్గర చోటుచేసుకున్న పరిణామాలపై దర్యాప్తును స్పీడప్ చేశారు పోలీసులు. వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న తోపుదుర్తి పరారయ్యారంటున్నారు పోలీసులు. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని హైకోర్టును కోరుతామంటున్నారు.

Thopudurthi Prakash Reddy : అజ్ఞాతంలో తోప్.. వెంటాడుతోన్న కాప్..
Thopudurthi Prakash Reddy

Updated on: May 02, 2025 | 1:04 PM

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లెలో వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్యకు గురయ్యారు. ఆయన కుటుంబాన్ని ఏప్రిల్ 8న వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. జగన్ పర్యటనలో హెలిప్యాడ్‌ దగ్గర జనం భారీగా దూసుకురావడంతో హెలికాప్టర్‌ విండ్‌ షీల్డ్‌ దెబ్బతింది. దీంతో ఇది పోలీసుల వైఫల్యం అంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన రామగిరి పోలీసులు. తోపుదుర్తి జనసమీకరణ చేసినట్టు నిర్ధారించారు. తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి సహా పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు.

ఈ కేసులో తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు పోలీసులు. అప్పటికే తోపుదుర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసుకున్నారన్నారు పోలీసులు. ఆయన కుటుంబ సభ్యులను విచారించగా తోపుదుర్తి ఆచూకీ తమకు తెలియదని చెప్పారన్నారు . పరారీలో ఉన్న ప్రకాష్‌ రెడ్డి కోసం గాలిస్తున్నామన్నారు పోలీసులు.

తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బెయిల్ విషయం తేలేవరకు పోలీసుల కంట పడకుండా తోపుదుర్తి జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. మరోవైపు తోపుదుర్తికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ హైకోర్టును కోరాలని యోచిస్తున్నారు రామగిరి పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో హెలికాప్టర్ పైలట్ అనిల్‌ కుమార్‌కు నోటీసులిచ్చి విచారించారు పోలీసులు.