ఒంగోలు నగరంలో చెడ్డీ గ్యాంగ్ దిగిందా… తాళం వేసిన ఇళ్శు, ఒంటరి మహిళలే టార్గెట్‌గా దోపిడీలకు పాల్పడేందుకు స్కెచ్ వేసిందా..? అనుమానంతో ప్రకాశం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒంగోలులో దోపిడీ దొంగల కదలికలపై అనుమానంతో పోలీసులు అర్ధరాత్రి నగరాన్ని జల్లెడ పట్టారు. 400 మంది పోలీసులతో జిల్లా వ్యాప్తంగా నాకాబందీ నిర్వహించారు. శాంతి భద్రతలు, నేరాల నియంత్రణ దృష్ట్యా అర్ధరాత్రి స్వయంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ. ఆర్. దామోదర్ స్వయంగా తనిఖీల్లో పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కొత్త వ్యక్తులను, అనుమానితులను గుర్తించేందుకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఒంగోలులోని రామ్ నగర్, భాగ్యనగర్, మంగమూరు రోడ్డు, NSP కెనాల్, త్రోవగుంట, ఇతర ముఖ్యమైన ప్రదేశాలలోను ఎస్పీ అర్ధరాత్రి పర్యటించి సిబ్బందికి, అధికారులకు సూచనలు చేశారు. వాహనాల తనిఖీలు నిర్వహించాలని, అనుమానితులు, గుర్తు తెలియని వ్యక్తుల వివరాలు తెలుసుకోవాలని, ఆధార్ కార్డులు పరిశీలించాలని ఆదేశించారు. అనుమానితులను పోలీసుస్టేషన్‌కు తరలించి విచారణ చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఒంగోలు నగరంలో 35 టీములు, జిల్లా వ్యాప్తంగా 400 మంది పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా హైవేలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, గ్రామ శివారులు, ఫ్లైఓవర్ల పక్కన నివసించే అనుమానితుల వ్యక్తులను విచారించారు. వాహనాల తనిఖీలు చేశారు. బీట్ సమయంలో ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ డివైస్ ద్వారా అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేశారు.
ఇళ్లల్లో జరిగే దొంగతనాల నియంత్రణ కోసం పోలీసు పరంగా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టడుతున్నామని ఎస్పీ దామోదర్ తెలిపారు. వివాహాలు, పండుగలకు ఊరికి వెళుతున్న ప్రజలు విలువైన వస్తువులు, ఆభరణాలు ఇంట్లో పెట్టుకోకూడదని, బ్యాంకుల్లో సురక్షితం చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు. ఎవరైనా అనుమానుస్పద వ్యక్తులు ఉంటే వెంటనే డయల్ 100 లేదా స్ధానిక పోలీస్ స్టేషన్‌కు తెలియచేయాలని ఎస్పీ ప్రజలను కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..