Andhra: టౌన్‌లో తప్పిపోయిన బాలిక.. డ్రోన్‌తో యాక్షన్‌లోకి పోలీసులు.. కట్ చేస్తే..

డ్రోన్లు గేమ్ ఛేంజ‌ర్లు అని ఏపీ సీఎం చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, శాంతిభద్రతల అంశాల్లో డ్రోన్లు వినియోగిస్తున్నారు. వైద్య సేవలు, ఎన్నికలు, వరదల సమయంలో కూడా ప్రభుత్వం డ్రోన్లు వినియోగిస్తుంది. తాజాగా.. తప్పిపోయిన బాలిక ఆచూకిని డ్రోన్‌ కెమెరా సాయంతో కనిపెట్టారు పోలీసులు.

Andhra: టౌన్‌లో తప్పిపోయిన బాలిక.. డ్రోన్‌తో యాక్షన్‌లోకి పోలీసులు.. కట్ చేస్తే..
Drone

Updated on: Mar 29, 2025 | 3:18 PM

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు ముందువరుసలో నిలుస్తున్నారు. భీమవరంలో తప్పిపోయిన ఓ ఏడేళ్ల బాలికను డ్రోన్‌ కెమరాను ఉపయోగించి గంట వ్యవధిలోనే పట్టుకున్నారు. చిన్నగొల్లపాలెంకు చెందిన బొర్రా నాయనమ్మ అనే వృద్ధురాలు తన మనవడు, మనవరాలని తీసుకుని ఆధార్‌ కార్డు అప్డేట్‌ చేయించుకోవడానికి భీమవరం హెడ్‌ పోస్టాఫీసు వద్దకు వెళ్లింది.

అయితే పిల్లలను పక్కన కూర్చోపెట్టి తాను వాటర్‌ బాటిల్‌ కోసం వెళ్లి తిరిగి వచ్చేసరికి మనవరాలు దివ్య కనిపించకుండా పోయింది. దీంతో కంగారుపడిపోయిన వృద్ధురాలు చుట్టుపక్కల వెతికినా పాప ఆచూకి లభించలేదు. దీంతో భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వన్‌టౌన్‌ సీఐ నాగరాజు వెంటనే స్పందించి బృందాలుగా ఏర్పడి డ్రోన్‌ సహాయంతో వెతకడం ప్రారంభించారు. మావూళ్లమ్మ అమ్మవారి ఆలయం వీధిలో ఏడుస్తూ రోడ్డు పక్కన ఉన్న పాపను గుర్తించారు. వెంటనే బాలికను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి నాయనమ్మకు అప్పగించారు. సాంకేతికత సాయంతో నింగి నుంచి సైతం పోలీసులు విధులు నిర్వర్తించడాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.

ఇక నేరాలను అరికట్టే విధంగా డ్రోన్ల సాయంతో  ‘క్లౌడ్‌ పెట్రోలింగ్‌’  చేస్తున్నారు ఏపీ పోలీసులు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న  అనుమానం వచ్చిన ప్రాంతాలకు డ్రోన్లను పంపి నిందితులను పట్టుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..