టెక్నాలజీ రోజురోజుకు అప్‌గ్రేడ్ అవుతోంది. ఇప్పుడు పోలీసులు, దర్యాప్తు సంస్థలు పలు కేసుల్లో చిక్కుముడులు విప్పడానికి ఎక్కువగా టెక్నాలజీపైనే ఆధారపడుతున్నారు. ఈ క్రమంలోనే 3 సంవత్సరాల కిందట చోరీకి గురైన బుల్లెట్ బైక్‌ని అనూహ్యంగా పట్టుకున్నారు పోలీసులు. అందుకు పోలీస్ యాప్ సాయపడింది. వివరాల్లోకి వెళ్తే… అనకాపల్లి జిల్లా(anakapalle district) నర్సీపట్నం ఎస్సై లక్ష్మణరావు తన టీమ్‌తో కలిసి అబీద్‌కూడలిలో శనివారం నైట్ వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లికి చెందిన ఓ యువకుడు బుల్లెట్ బండిపై అటుగా వచ్చాడు. అతడిని ఆపి డాక్యుమెంట్లు చూపించమని అడిగారు. ఆ యువకుడు అన్ని రికార్డులు చూపించకపోవడంతో.. ఈ-చలానాలోని ‘బోలో ఆప్షన్’ ప్రెస్ చేవారు. వెంటనే అందులోని అలారం మోగింది. వెంటనే అలర్టైన పోలీసులు వివరాలు చెక్ చేయగా… ‘ఏపీ 05 డీఆర్ 2755’ నంబరు ఉన్న బుల్లెట్ 2019లో చోరీకి గురైందని చూపించింది. ఆ మేరకు కాకినాడ జిల్లా(kakinada district) తుని(Tuni)లో తన బైక్ పోయినట్లు యజమాని చేసిన ఫిర్యాదు కాపీ సెల్‌ఫోన్ తెరపై ప్రత్యక్షమైంది. వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుని తుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్నేళ్ల తర్వాత యాప్ సాయంతో బైక్ దొరకడంతో తుని పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ బైక్ ఆ యువకుడే చోరీ చేశాడా..? లేదా ఇంకెవరైనా చోరీ చేసి అతనికి అమ్మారా అన్న కోణంలో దర్యాప్తు షురూ చేశారు.