Andhra: పండగ పూట ఈ మాట్లాడే చిలుక భలే పని చేసింది.. పీఎస్‌కే చేరిన పంచాయతీ

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. కాట్రేనికోన మండలానికి చెందిన బండారు దొరబాబు అల్లారుముద్దుగా పెంచుకున్న తన పెంపుడు చిలుక ‘చార్లి’ కనిపించకుండా పోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. హైదరాబాద్‌లో రూ.80 వేల వెచ్చించి కొనుగోలు చేసిన ఈ మాట్లాడే చిలుక సంక్రాంతి రోజున పంజరం శుభ్రం చేసే సమయంలో ఎగిరిపోయింది.

Andhra: పండగ పూట ఈ మాట్లాడే చిలుక భలే పని చేసింది.. పీఎస్‌కే చేరిన పంచాయతీ
Talking Parrot Charlie

Edited By:

Updated on: Jan 23, 2026 | 10:19 PM

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న తన పెంపుడు చిలుక కనిపించకుండా పోవడంతో ఓ యజమాని తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. మూడేళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకున్న చిలుక ఆచూకీ కోసం కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలానికి చెందిన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. కాట్రేనికోనలో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్న కొత్తపాలెం గ్రామానికి చెందిన బండారు దొరబాబుకు పక్షులంటే ఎంతో అభిమానం. ఈ క్రమంలోనే మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో రూ.80 వేల వెచ్చించి ఓ ప్రత్యేకమైన మాట్లాడే చిలుకను కొనుగోలు చేశారు. దానికి ‘చార్లి’ అని పేరు పెట్టి కుటుంబ సభ్యుడిలా ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు. మనుషుల మాటలను స్పష్టంగా అనుకరిస్తూ పలకరించే ఆ చిలుక దొరబాబుకు ప్రాణప్రదంగా మారింది.

ఇటీవల సంక్రాంతి పండుగ రోజున చిలుక పంజరాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో ‘చార్లి’ బయటకు వచ్చి ఒక్కసారిగా ఎగిరిపోయింది. తనతో బాగా అలవాటు పడిన చిలుక కావడంతో సాయంత్రానికి తిరిగి వస్తుందని దొరబాబు భావించాడు. కానీ అది తిరిగి రాలేదు. రోజులు గడిచినా, ఎన్ని చోట్ల వెతికినా చిలుక ఆచూకీ లభించకపోవడంతో దొరబాబు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. చిలుక కనిపించకుండా పోయిన విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఊరంతా వెతికిన దొరబాబుకు, సమీప ఇంటివారే చిలుకను బంధించారని స్థానికుల ద్వారా సమాచారం అందింది. చిలుకను తిరిగి ఇవ్వాలని, అవసరమైతే డబ్బులు కూడా ఇస్తామని దొరబాబు వారిని వేడుకున్నట్లు తెలిపారు. అయితే వారు చిలుక కొంతసేపటికి ఎగిరిపోయిందని చెబుతూ మాటలు తప్పిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

తన అపురూపమైన చిలుకను సమీపంలోని వారే బంధించారని నమ్ముతున్న దొరబాబు, చిలుకను తిరిగి అప్పగించాలంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లో రూ.80 వేల విలువతో కొనుగోలు చేసిన మాట్లాడే చిలుక ‘చార్లి’ తిరిగి దొరబాబుకు చేరుతుందా? లేక ఈ ఘటన మరో మలుపు తిరుగుతుందా? అన్నది ఇప్పుడు స్థానికంగా ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.