
అటు తెలంగాణ, ఇటు ఏపీలో ఉచిత బస్సు సర్వీసు అమలులో ఉంది. ఏపీలో అయితే ఆగష్టు నుంచి పథకాన్ని ప్రారంభించింది కూటమి సర్కార్. అయితే ఈ పథకం మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో అనేక మీమ్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల టెక్నాలజీ పరంగా అందుబాటులోకి వచ్చిన ఏఐ ద్వారా తయారుచేసిన వీడియోలతో వచ్చిన మీమ్స్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఇంట్లో బోర్ కొడుతోంది అలా సరదాగా పుట్టింటికి వెళ్లి సాయంత్రానికి వచ్చేస్తానని, భర్త తిట్టాడు అలిగి పుట్టింటికి వెళ్లి సాయంత్రానికి వచ్చేస్తానని.. ఎలాగో చార్జీలు లేవు కదా అని ఇలా రకరకాలుగా సెటైరికల్ వీడియోలు చూశాం.
ఇక ఇటీవల కాలంలో ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత పెళ్లిళ్లు, శుభకార్యాలకు హాజరయ్యే మహిళల సంఖ్య అనూహ్యంగా పెరిగినట్టు అనేక సందర్భాల్లో నిరూపితమైంది. మరీ దగ్గరి బంధుత్వం ఉంటే తప్ప దూర ప్రాంతాలకు పెళ్లిళ్లకు, శుభకార్యాలకు వెళ్లడానికి అంతగా ఆసక్తి చూపని మహిళలు.. ఇప్పుడు కార్యక్రమం ఎంత దూరమైనా సరే ఉచిత బస్సు ప్రయాణం కావడంతో ఏమాత్రం ఆలోచించకుండా ఫంక్షన్లకు అటెండ్ అవుతున్నారు. కొన్నేళ్లుగా వివాహాలు లేదా మరి ఏదైనా శుభకార్యాలు నిర్వహించే నిర్వాహకులు ఎంతమందిని ఆహ్వానించాం..? ఎంతమంది వస్తారు.? అనేది ఒక అంచనాతో ఏర్పాట్లు చేసుకునేవారు. అందులో ముఖ్యంగా భోజనాలను క్యాటరింగ్ ఆర్డర్ ఇవ్వడం అనేది చాలా కీలకం. వచ్చిన వారందరికీ భోజనాలు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలనేది అందరూ చేసుకునే జాగ్రత్తల్లో ఒకటి.
ఇక ఇప్పుడు జరుగుతున్న శుభకార్యాలలో అంచనాలకు తగ్గట్టు భోజనాలు ఏర్పాటు చేసుకున్నా కూడా సగానికి పైగా భోజనం చేశాక.. భోజనాలు లేవన్న కంప్లైంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలా అంచనాలను అందుకోలేకపోతున్నామని అందరూ అనుకోగా.. అది ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కారణమని తేల్చారు. గతంలో పది కిలోమీటర్లకు మించి ప్రయాణించి శుభకార్యాలకు వెళ్లాలంటే చార్జీలు ఖర్చుల గురించి ఆలోచించే మహిళలు.. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం కావడంతో ఏమాత్రం ఆలోచించకుండా ఎంత దూరమైనా వెళ్ళిపోతున్నారు.