మాటల్లో చెప్పలేని భావాలకు కలమే ఓ వరం. ధైర్యంగా అడగలేని ప్రశ్నలకు కలమే ఓ సమాధానం. కన్నీరు తీర్చలేని సమస్యలకు కలమే ఓ పరిష్కారం. ఎవరూ నిలదీయలేని వికృత చేష్టలకు కలమే ఓ చెప్పుదెబ్బ. బారసాలలో పిల్లల ముందుంచే వస్తువులలో కలం కూడా ఒకటి. డబ్బు, బంగారం కాకుండా కలం పట్టుకుంటే ఆ బిడ్డ గొప్ప విద్యావంతుడవుతాడని నమ్ముతారు. అన్నట్లు కోర్టులో నేరస్తుడికి మరణశిక్ష విధించిన సందర్భంలో ఆ తీర్పు చదివిన వెంటనే.. న్యాయమూర్తి ఆ తీర్పు రాసిన పెన్ను పాళీని వంచేసి విరగొట్టే సంప్రదాయము కోర్టుల్లో ఉండేది. పలువురికి కలం ఒక సెంటిమెంట్ కూడా. అందుకే కలం అంటే ప్రాణంగా ఇష్టపడేవారు ఉన్నారు. బ్రాండెడ్ వాచీలు, బట్టలు, ఇతర వస్తువులు ఎలాగో అలాగే విలువైన పెన్నులకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. పెన్నుని కొంతకాలం వాడేసి పారేసే వారు కొందరైతే… తమ సెంటిమెంట్ గా వాటిని కలకాలం ఉంచుకునే వారు మరికొందరు. అలాంటి వారి కోసమే శ్రీకాకుళంలో ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది పెన్ హాస్పిటల్.
నేటి తరానికి పాలి పెన్నులు… పెన్నులలో ఇంకు పోసుకోవటo, పెన్నుని క్లీన్ చేసుకోవడం, నిబ్ పాడయితే దానిని మార్చుకోవటం వంటివి పెద్దగా తెలియదు. యూజ్ అండ్ త్రో యుగంలో ఉన్న నేటి యువత మొబైల్ ఫోన్ మొదలుకుని ఏ వస్తువునైనా ఏడాది వాడటం తరువాత దానిని పక్కన పడేసి కొత్త దానిని కొనుక్కోవడం పట్లే ఆసక్తి చూపుతున్నారు. కానీ శ్రీకాకుళంలో మాత్రం పెన్నులు పాడయితే దానిని హాస్పిటల్ కి తీసుకు వెళతారు. అదేంటి మనుషులు, పశువులు అయితే హాస్పిటల్ కి తీసుకు వెళతారు కానీ పెన్నులు బాగుచేసే చోటుని హాస్పిటల్ అంటారేoటని అనుకుంటున్నారా….? అయితే ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి.
ఇక్కడ కలానికి ఎనలేని గౌరవం ఇస్తారు. పైగా జీవమున్న మనుషులను, పశువులను ఎలా అయితే ట్రీట్ చేస్తారారో అలాగే అనేక భావోద్వేగాలు, సెంటిమెంట్లతో తమ వద్దకు వచ్చే పెన్నులను సున్నితంగానే ట్రీట్ చేస్తారు ఇక్కడ. అలాఅని ఈ పెన్ హాస్పిటల్ ఈ మధ్యకాలంలో వచ్చిందయితే కాదు.. 1975 నుంచి ఈ పెన్ హాస్పిటల్ శ్రీకాకుళం 2టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్వహిస్తున్నారు. పొట్నూరు రాజారావు అనే వ్యక్తి ఈ పెన్ హాస్పిటల్ కి ఆద్యడు. కరోనా సమయంలో అతను మరణించగా వారసుడుగా అతని కుమారుడు నాగరాజు స్టేషనరీ, గిఫ్ట్ ఆర్టికల్స్ అమ్మటంతో పాటు అందులోనే ఈ పెన్ హాస్పిటల్ ను నిర్వహిస్తూ వస్తున్నాడు. ఎంత కాస్ట్లి పెన్ అయినా తండ్రికి ఇచ్చిన మాట బట్టి ఫ్రీగానే రిపేర్ చేసి ఇస్తాడు నాగరాజు. కొత్త, పాత అని తేడా లేకుండా అన్ని రకాల పెన్స్‌ను సరిచేసి ఇవ్వడం వీరి స్పెషాలిటీ.
ఈ పెన్ హాస్పటల్‌లో పెన్నులకు రిపేర్ చెయ్యటమే కాదు రూపాయి నుంచి లక్ష రూపాయిలు విలువ చేసే పెన్ను వరకు అనేక రకాల పెన్నులు అమ్మకానికి ఉంటాయి. ఈ పెన్ హాస్పిటల్ లో షీఫర్స్, మౌంట్ బ్లాక్ ,క్రాస్, వాటర్ మెన్, పార్కర్, పిన్ లైన్, పెరి కార్డెన్ కంపెనీలకు చెందిన ఎంతో విలువైన దేశ విదేశాల పెన్నులు అమ్మకానికి ఉంటాయి. మనుషుల మాదిరిగానే జీరో సైజ్ పెన్నులు, A4 సైజ్ పేపర్ అంతా బరువు మాత్రమే ఉండే వెయిట్ లాస్ పెన్నులు ఉన్నాయి. 80 ఏళ్ల పాటు ఇంకు గాని, రీఫిల్ గాని మార్చాల్సిన పని లేకుండా వాడే ఇన్ఫినిటీ పెన్ ఇక్కడ ఓ ప్రత్యేకం. ఈ పెన్నులో ఇంకుకు బదులు కార్భనిక్ గ్యాస్ ఉంటుంది. ఈ పెన్ ధర రూ.20,700
ఇక AK 47 బుల్లెట్ తో రూపొందించిన బుల్లెట్ పెన్ కూడా పెన్ లవర్స్ తో పాటు సాధారణ ప్రజానీకాన్ని సైతం ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. అటు 24 కేరట్స్ గోల్డ్ ప్లేటెడ్ తో రూపొందించిన షీఫర్స్ కంపెనీ పెన్ను ధర అక్షరాలా రూ.75 వేలు. అయితే ఇంత ధర పెట్టీ కొన్న పెన్నులకు, సాధారణ పెన్నులకు సౌలభ్యం, హ్యాండ్ రైటింగ్ పరంగా చాలా వ్యత్యాసం ఉంటుందని అంటున్నారు పెన్ హాస్పిటల్ నిర్వాహకులు. ఒకసారి ఈ పెన్నులకు అలవాటు పడితే వదలలేరని చెబుతున్నారు.
ముఖ్యంగా కవులు, రచయితలు తమకు సౌలభ్యంగా ఉన్న కలం విషయంలో ఎంత ధర అయినా వెనక్కి తగ్గరని అంటున్నారు. ఇక చాలా మంది తమ సొంతానికి వాడుకునేoదుకు ఇష్టపడి ఈ కాస్ట్లీ పెన్నులు కొనుగోలు చేస్తే….మరికొంతమంది తల్లిదండ్రులకు, ప్రేయసి, ప్రియులకి, పై అధికారులకు గిఫ్ట్ గా కొనుగోలు చేసి ఇస్తారని అంటున్నారు.
సిరా అనే ఇంధనంతో అక్షరం అనే ఆయుధాన్ని వెంటపెట్టుకొని ప్రపంచాన్ని జయించేది కలం. అందుకే ఆత్రేయ,ఆరుద్ర, ఓల్గా లాంటి ఎందరో ప్రముఖ రచయితలు, కవులు వారి రచనలను కలం పేర్లతో ప్రచురించి ఫేమస్ అయ్యారు. కలం స్నేహం పేరిట పరిచయాలు అవుతున్నారు.కలానికి కాలం చెల్లి కంప్యూటర్ కి దగ్గరైన ఈ రోజుల్లో శ్రీకాకుళంలో ఇంకా పెన్ హాస్పిటల్ ఆదరణ పొందటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి