కొత్త జిల్లాలకు పేర్లు పెట్టినప్పుడే అంబేడ్కర్ పేరు కూడా పెడితే బాగుండేదని, అలా చేసి ఉంటే ఇప్పుడు అమలాపురం(Amalapuram) అగ్నిగుండంలా మారేది కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. అంబేడ్కర్ పేరు పెట్టడంలో ఎందుకు ఆలస్యం చేశారో అర్థం కావట్లేదన్న పవన్ అభ్యంతరాల స్వీకరణకు మిగతా జిల్లాలకు సమయం ఇవ్వకుండా కోనసీమ(Konaseema) కే ఎందుకు సమయం ఇచ్చారని ప్రశ్నించారు. గొడవలు జరగాలనే అభ్యంతరాలకు సమయం ఇచ్చారా అని నిలదీశారు. అంబేడ్కర్ కు గౌరవం ఇవ్వడమంటే ఆయన సిద్దాంతాలు పాటించడం అని పవన్ అన్నారు. ఎస్పీలలో బలం తగ్గుతోందన్న భావించి వైసీపీ(YCP) నేతలే ప్లాన్ చేసి గొడవలకు తెర లేపారని ఆరోపించారు. వారి మీద వారే దాడి చేయించుకుని సింపతీ కోసం చూస్తున్నారని మండిపడ్డారు. నిన్న జరిగిన అల్లర్లలో తమ పార్టీకి చెందిన నేతలు ఉన్నారని హోమంత్రి తానేటి వనిత చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందని పవన్ వెల్లడించారు.
జిల్లాల పేర్లు పెట్టేటప్పుడు స్థానికుల నుంచి సూచనలు, సలహాలు తీసుకోకుండా ఇష్టారీతిన వ్యవహరించారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములును ఒక జిల్లాకు పరిమితం చేశారు. కృష్ణా నది తక్కువగా ఉన్న చోట కృష్ణా జిల్లా పేరు పెట్టి, కృష్ణా నది ఎక్కువగా ఉన్న చోట ఎన్టీఆర్ జిల్లా అని పెట్టారు. మిగతా జిల్లాలతో పాటు కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ అని పెడితే సహజంగా ఉండేది. అభ్యంతరాలుంటే 30 రోజుల సమయమిచ్చి కలెక్టరేట్‌కు రమ్మని చెప్పారు. 30 రోజుల గడువు ఎందుకు? గొడవలు జరగాలని కాదా? మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారంటే ఏమనుకోవాలి?దాడి జరుగుతుంటే ఇంటికి రక్షణగా ఉండాలి కదా? చేసిందంతా చేసి జనసేనపై ఆరోపణలు చేస్తూ కులసమీకరణపై రాజకీయాలు చేస్తున్నారు.
– పవన్ కల్యాణ్, జనసేన అధ్యక్షుడు
వైసీపీ కుల రాజకీయం చేస్తోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. దళిత యువకుడిని తానే చంపానని ఎమ్మెల్సీ చెప్పినప్పటికీ పోలీసులు వెంటనే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. జగనన్న విద్య దీవెన, అంబేడ్కర్ విదేశీ విద్య పథకాలను ప్రభుత్వం ఆపేసిందని మండిపడ్డారు. విభజన రాజకీయాలు చేసే ఇలాంటి పార్టీలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పవన్ సూచించారు. వైసీపీ నాయకులు గొడవలు సృష్టించి పంచాయతీ చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి