Kurnool: నిందితుడు లొంగిపోతే పోలీసులకు కోపం వచ్చింది.. ఎందుకంటే..?

కోర్టులో లొంగిపోయిన నిందితుడిని పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు తీసుకెళ్లిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పత్తికొండ కోర్టులో జరిగిన ఈ ఘటనపై న్యాయవాదులు తీవ్రంగా స్పందిస్తూ, ఇది కోర్టు అవమానమేనని నిరసనకు దిగారు. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి ....

Kurnool: నిందితుడు లొంగిపోతే పోలీసులకు కోపం వచ్చింది.. ఎందుకంటే..?
Police misconduct allegation

Edited By:

Updated on: Dec 25, 2025 | 11:05 AM

కోర్టులో లొంగిపోయిన నిందితుడిని పోలీసులు ఈడ్చుకుంటూ బలవంతంగా తీసుకెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పోలీస్ స్టేషన్లో లొంగిపోకుండా కోర్టులో లొంగిపోవడంతో పోలీసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కోర్టు నుంచి ఈడ్చుకుంటూ స్టేషన్‌కు బలవంతంగా తీసుకెళ్లారు. ఈ ఘటనపై నివ్వెరపోయిన న్యాయవాదులు.. ఈ ప్రవర్తన కోర్టును అవమానించడమే అంటూ నిరసనలకు దిగారు. సర్ది చెప్పేందుకు వచ్చిన సీఐని కూడా చుట్టుముట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. కర్నూల్ జిల్లా ఆస్పరి మండలం డేగులపాడు గ్రామంలో శివయ్య అనే రైతు కౌలుకు తీసుకున్న పొలంలో గంజాయి సాగు చేశారు. విశ్వాసనీయ వర్గాల సమాచారం ఆధారంగా పోలీసులు, ఇతర శాఖల అధికారులు వెళ్లి పంటను నాశనం చేశారు. గంజాయి మొక్కల్ని ట్రాక్టర్లలో తరలించారు. శివయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న శివయ్య నేరుగా పత్తికొండ కోర్టులో బుధవారం సాయంత్రం లొంగిపోయారు. పోలీస్ అరెస్టు నుంచి బయటపడేందుకు కోర్టులో లొంగిపోతావా అంటూ పోలీసులు ఆగ్రహించారు. కోర్టు హాల్లో లొంగిపోయి ఉన్న నిందితుడు శివయ్యను.. ఇద్దరు ఎస్ఐలు, మరో ఇద్దరు పోలీసులు  బలవంతంగా లాక్కెళ్లి జీప్‌లో ఎక్కించి.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడున్న న్యాయవాదులంతా అవాక్కయ్యారు. చట్టానికి విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని ఒక రకంగా కోర్టును అవమానించారని న్యాయవాదులు మండిపడ్డారు నిరసనకు దిగారు సర్ది చెప్పేందుకు వచ్చిన సిఐ ని కూడా చుట్టుముట్టారు. లొంగిపోయిన నిందితుడు శివయ్యను తక్షణమే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. జరిగిన దానిపై విచారిస్తామని సిఐ చెప్పడంతో న్యాయవాదులు శాంతించారు. దీనిపై పెద్ద ఎత్తున బ్యాడ్‌గా ప్రచారం జరగడంతో పోలీసుల వివరణ ఎలా ఉంటుందనే దానికి ఆసక్తి నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.