
ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న పరిటాల గ్రామానికి అద్భుతమైన చరిత్ర ఉంది. నిజాం నవాబుల కాలంలో.. ఆనాటి రాజకీయ ఒప్పందాల కారణంగా పరిటాలతో పాటు.. పక్కన ఉన్న ఏడు గ్రామాలను నిజాం తన ఆధీనంలో పెట్టుకున్నారు. మిగతా కృష్ణాజిల్లాను బ్రిటిష్ వాళ్లకు ఇచ్చేశాడు. ఈ పరిటాల ప్రాంతాన్ని తన ఆధీనంలో పెట్టుకోవటానికి ప్రధానమైన కారణం వజ్రాలు. పురాతన కాలం నుంచి కూడా పరిటాల ప్రాంతంలో వజ్రాలు విపరీతంగా లభించేవి. ఇక్కడ దొరికే విలువైన వజ్రాలను చార్మినార్ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ మెరుగులు అద్ది ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేవారు. అలాంటి విలువైన వజ్రాలను అందించే ఘనమైన పరిటాలలో.. 1766 నుంచి నిజాం చేతుల్లోకి వెళ్లిందని చరిత్రకారులు చెబుతున్నారు.
పరిటాలను బ్రిటిష్ వాళ్ల నుంచి తీసుకోవడంతో.. బ్రిటిష్ వాళ్లకు తెలంగాణలోని ప్రస్తుత హుజూర్ నగర్ దగ్గర ఉన్న లింగగిరి, కోదాడ దగ్గరున్న మునగాల పరగణాలను ఇచ్చారు నిజాం. ఇందుకు సంబంధించి.. 1788లో నిజాం- బ్రిటీష్ వాళ్లు ఒప్పంద కాగితం కూడా రాసుకున్నారు. ఇలా రెండో నిజాం అసఫ్ జాహీ కాలం నుంచి పరిటాల అనేది ఒక ద్వీపం లాగా ఉంటూ నిజాం పరిపాలనలో ఉండేది.
నిజాం అధికారులు పరిటాలతో పాటు గని ఆతుకూరు, బత్తినపాడు, మోగులూరు, కొడవటికల్లు, ఉస్తేపల్లి, మల్లవల్లి గ్రామాల్లో రాక్షసంగా వ్యవహరించేవారని అప్పటి పెద్దలు చెబుతున్నారు. పన్ను వసూలు కోసం పనిచేసే లంక సుబ్బయ్య శాస్త్రి అనే అధికారి.. నిజాంల మన్ననలు పొందడానికి ప్రజల్ని చిత్రహింసలు పెట్టేవారంటున్నారు. ఆడవాళ్లపై అత్యాచారం చేయించటం, దేవాలయాలలో దీపారాధనలు ఆర్పించడం లాంటి దుర్మార్గాలు చేసే వాడని,.. శిస్తు కట్టలేదని చెప్పి వాళ్ల ఇండ్లకు వెళ్లి ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించే వారని తెలిపారు. ఇంతటి అరాచకాలు చేస్తున్న లంక సుబ్బయ్య శాస్త్రిని గొట్టిముక్కల దగ్గర ప్రజలు తిరగబడి చంపేశారని చరిత్రకారులు అంటున్నారు.
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ హైదరాబాద్ సంస్థానానికి మాత్రం స్వాతంత్ర్యం రాలేదు. నిజాం సంస్థానంలో భాగమైన పరిటాలకు కూడా స్వాతంత్ర్య ఫలాలు దక్కలేదు. ఇండియాలో కలిసేది లేదని, తాము స్వతంత్రంగా ఉంటామని నిజాం ప్రకటించిన తర్వాత.. పరిటాల ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. యూపీ, బెంగాల్ పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ కూడా గ్రామ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. 1947 నవంబర్ 15న.. పరిటాల ఖానత్ తాలూకాను రిపబ్లిక్‌గా ప్రకటించారు. మాదిరాజు దేవరాజును అధ్యక్షుడిగా ఒక విప్లవ ప్రభుత్వాన్ని నడిపారు. అప్పటి నుంచి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యేవరకు పరిటాల రిపబ్లిక్ అనే పేరుతో అద్భుతమైన ప్రభుత్వాన్ని నడిపారు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అంతకుముందే.. 1947 నవంబర్ 15 నుంచే పరిటాలకు ప్రత్యేక రాజ్యాంగం అమల్లో ఉంది. దేశానికి రాజ్యాంగం లేక ముందే.. పరిటాలలో రాజ్యాంగం ఉండటం.. తెలుగు ప్రజలందరూ గర్వించదగ్గ విషయం. పరిటాల రాజ్యాంగంతో.. ఏడాదిన్నర పాటు ఈ ప్రాంతంలో అద్భుతమైన పాలన సాగిందని స్థానికులు చెబుతున్నారు.
పరిటాల రిపబ్లిక్ ప్రభుత్వానికి ఒక అధ్యక్షుడు, ఒక ప్రధాన కార్యదర్శి, ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఏ రాత్రయినా, ఏ క్షణమైనా నిజాం సైన్యం, రజాకార్లు తమ ఏడు గ్రామాలపై దాడి చేయొచ్చని ప్రత్యేక సైన్యం రూపొందించుకున్నారు. ఏడు గ్రామాల్లో ఇంటికొక పిల్లవాడ్ని తీసుకుని.. వారందరికీ ఆజాద్ హింద్‌కు చెందిన రాంచందర్ వ్యక్తి దగ్గర ట్రైనింగ్ ఇప్పించారు. ఆయన ఆధ్వర్యంలో పిల్లలందరికీ ఆధునిక పద్ధతుల్లో ట్రైనింగ్ ఇచారు. గ్రామ రక్షక దళాల పేరుతో ప్రతిరోజు ఊరు మధ్యలో కాపలా కాయటానికి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నాటి పాలనకు నిలువెత్తు సాక్ష్యంగా పరిటాల రిపబ్లిక్ వజ్రోత్సత విజయ స్థూపం ఇప్పటికీ ఉంది. ఈ స్థూపంలో.. 1947లో పరిటాల ఠానాపై దాడి నుంచి భారత్‌లో విలీనం వరకు అన్ని తేదీలను క్లియర్‌గా రాశారు.
పరిటాలలో.. సొంత పాలన చూడటం కోసం జయప్రకాశ్ నారాయణ, అరుణా అసఫ్ అలీ, హయగ్రీవ చారి లాంటి స్వాతంత్ర్య సమరయోధులు ఇక్కడికి వచ్చారు. మహాత్మా గాంధీ కూడా పరిటాలలో స్వపరిపాలన గురించి గొప్పగా కొనియాడారని అధికార పత్రాలు కూడా ఉన్నాయి. తెలుగు నాయకులైన టంగుటూరి ప్రకాశం పంతులు, పీవీ నరసింహారావు, హైదరాబాద్ స్టేట్ ఫౌండర్ అయిన రామానంద తీర్థ పరిటాలలో నెలల తరబడి ఉండి పరిటాలలో సాగుతున్న అద్భుతమైన పాలనను మెచ్చుకున్నారు.
ఇంతటి ఘన ఖ్యాతి కలిగిన పరిటాల.. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులో ఉండటం తెలుగు ప్రజలందరూ గర్వించాల్సిన విషయం. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ.. ఈ పరిటాల రిపబ్లిక్ చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే.