మృత్యువులోనూ మారని మానవత్వం.. ఇద్దరు బిడ్డలను కోల్పోయిన.. గొప్ప మనస్సు చాటుకున్న తల్లిదండ్రులు!
విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన, మానవత్వానికి నిలువుటద్దంగా నిలిచింది. కడుపుకోతను అనుభవిస్తూ కూడా ఇద్దరు కుమారుల కళ్లను దానం చేసిన ఆ తల్లిదండ్రుల నిర్ణయం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని, పరహితం కోరిన ఆ తల్లిదండ్రుల నిర్ణయంపై నెటిజన్లు, స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన, మానవత్వానికి నిలువుటద్దంగా నిలిచింది. కడుపుకోతను అనుభవిస్తూ కూడా ఇద్దరు కుమారుల కళ్లను దానం చేసిన ఆ తల్లిదండ్రుల నిర్ణయం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని, పరహితం కోరిన ఆ తల్లిదండ్రుల నిర్ణయంపై నెటిజన్లు, స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
విజయనగరం జిల్లా వంగర మండలం కె.కొత్తవలస గ్రామానికి చెందిన తోట అజయ్ (26), విజయ్ (23) అన్నదమ్ములు. ఆ కుటుంబానికి వీరే పెద్ద దిక్కు. ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతూ తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తున్న ఈ యువకులు, విజయనగరం మండలం జొన్నవలస సమీపంలోని జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు బైక్ బోల్తా పడటంతో తీవ్ర రక్తస్రావమై, ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కుమారులు మృత్యువాత పడడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం మహారాజా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కుమారులను కోల్పోయిన తండ్రి ఎల్లయ్య, తల్లి శోభ పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఆ సమయంలో మహారాజా ఆసుపత్రి రెడ్‌క్రాస్ నేత్ర విభాగం టెక్నీషియన్ రమణ, ఇతర వైద్యులు, నేత్రదానం ప్రాముఖ్యతను వారికి వివరించారు. తమ బిడ్డలు మరణించినా, వారి కళ్ల ద్వారా మరికొందరికి ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం కల్పించవచ్చని ఆ తల్లిదండ్రులు భావించారు. ఆ ఘోర విషాదంలోనూ వారు గుండె నిబ్బరం చేసుకుని, కుమారుల కళ్లను దానం చేసేందుకు అంగీకరించారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజ పర్యవేక్షణలో వైద్య బృందం అన్నదమ్ముల కళ్ల నుండి కార్నియాలను సేకరించారు. ఈ నేత్రదానం ద్వారా నలుగురు అంధులకు చూపు లభించే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. “తమ కుమారులు ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా, సమాజం కోసం వారు తీసుకున్న నిర్ణయం అత్యున్నతమైనది. ఆ తల్లిదండ్రుల త్యాగం సామాన్యులకు స్ఫూర్తిదాయకం.” అని వైద్య బృందం అభినందించింది.
ప్రాణం పోయినా పరుల కోసం బ్రతకవచ్చని చాటిచెప్పిన ఈ ఘటన, మరణానంతరం అవయవదానంపై సమాజంలో గొప్ప ఆలోచనను రేకెత్తించింది. వారి బిడ్డలు భౌతికంగా లేకపోయినా, నలుగురు అంధుల కళ్లలో వెలుగుగా వారు జీవించే ఉంటారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
