
కర్నూలులోని పందికోన ఓ మారుమూల గ్రామం. నిజం చెప్పాలంటే అది ఓ అడవి…అక్కడ పెరిగే ఓ ప్రత్యేకమైన కుక్కలే పందికోన కుక్కలుగా ప్రసిద్ధి చెందాయి. గ్రామసింహాలే.. కానీ నిజంగా సింహాలను తలపించేలా ఉంటాయి. ఈ జాతి కుక్కలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హల్‌చల్ చేస్తున్నాయి. ఒక కుక్క పిల్ల లేదా ఒక కుక్క ..ఏదైనా పర్వాలేదు.. ప్లీజ్ ఒకటి ఇవ్వండి డబ్బులు ఎంతైనా పర్వాలేదు… ఈ మాటలు ఎవరివో కాదు.. ఎన్నారైలు పోలీస్ అధికారులు ధనవంతుల నుంచి గ్రామస్తులకు వస్తున్న ఫోన్ కాల్స్…అక్కడి కుక్కలకు ఎందుకింత డిమాండ్? ఇదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్.
కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో ఉంది పందికోన.. పత్తికొండ కు దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామ జనాభా 5000 పైనే ఉంటుంది. ఈ గ్రామానికి చుట్టూ పెద్ద అడవి. అందుకే గతం లో గ్రామంలోకి పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు వచ్చి దాడి చేసేవి. రక్షణ లేని అటవీ ప్రాంతంలో ప్రజలకు అప్పుడు కుక్కలు సాయపడేవి. అడవి మృగాలు రావడం, కుక్కలతో కలిసి గ్రామస్తులు అడ్డుకోవడం పరిపాటిగా ఉండేది. ఓసారి చిరుత _ ఆడ కుక్క మధ్య సంపర్కం ద్వారా పిల్లలు పుట్టాయని, ఆ పిల్లలే నేటి పందికోన కుక్కల జాతి అని ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగి పెద్దయి,ఒక ప్రత్యేకమైన లక్షణాలను కాలక్రమంలో సంతరించుకున్నాయని గ్రామస్తులు కథలు కథలుగా చెపుతారు.
పందికోన జాతి కుక్కల అభివృద్ధితో ఈ శునకాలు చిరుతలు కాదు కదా ఎలాంటి అడవి జంతువులు వచ్చినా అడ్డుకొని చంపేస్తాయట. ఇక ఈ గ్రామాలకు అడవిజంతువుల బెడదపోయింది. ఇళ్ళల్లో దొంగతనాలు లేవు. చిరుతలు నక్కలు వచ్చి గొర్రె పిల్లను, పశువులను ఎత్తుకెళ్లి చంపేవి. నేడు ఆ పరిస్థితి లేదు. ఒక్కొక్క గొర్రెల కాపరి కనీసం అయిదు నుంచి 10 కుక్కలను పెంచుకుంటున్నాడు. నిశ్చింతగా ఆరుబయట నిద్రపోతున్నారు గొర్రెల కాపర్లు. గొర్రెల మందతో పాటు కుక్కలు కూడా ఉంటాయి. ఇది తెలిసినప్పటినుంచి గ్రామంలో దొంగతనాలు జరగలేదు. పందికోన కుక్కలకు గోర్లు , కళ్ళు, చెవులు ఇతరత్రా చిరుతలను పోలీ ఉంటాయి. పౌరుషానికి విశ్వాసానికి ప్రతీక అనే అక్కడి గ్రామస్తులు గొప్పగా చెప్పుకుంటారు.
ఈ మూడు లక్షణాలూ కలగలిస్తే ఈ ప్రత్యేకమైన పందికోన జాతి కుక్క అవుతుంది. వీటి సాహసం, రాజసం నేరస్తుల గుండెల్లో రైళ్ళు పరిగెట్టిస్తోంది. అలాంటి జాగిలాలు తోడుంటే ఎలాంటి వారైనా ధైర్యంగా ముందుకు దూసుకెళ్తారు. ఓసారి చిరుత, ఆడ కుక్క మధ్య సంపర్కం ద్వారా పిల్లలు పుట్టాయని, ఆ పిల్లలే నేటి పందికోన కుక్కల జాతి అన్నది ఆ గ్రామ ప్రజల ఉమ్మడి మాట. నేర పరిశోధనలో ప్రస్తుతం ఈ కుక్కలు తమ తడాఖా చూపిస్తున్నాయి. ఈ పందికోన కుక్కల పౌరుషం విశ్వాసం గురించి దేశం నలుమూలల టాక్ టాప్‌రేపుతోంది. ముందుగా జిల్లా తో పాటు రాష్ట్రంలోని పోలీస్ అధికారులు తమ ఇళ్లలో పెంచుకుంటున్నారు అమెరికాలో సహా విదేశాలలో ఉన్న తెలుగు వారు ఇక్కడి కుక్కను తీసుకెళ్లి పెంచుకుంటున్నారు. దీంతో ఈ జాతి కుక్కలకు డిమాండ్ పెరిగింది. కొరత కూడా పెరిగింది.
కర్నూలు జిల్లాలో లో పని చేసిన ఎస్పీలు కలెక్టర్ల సహా బదిలీపై వెళ్లిన అధికారులందరూ చాలామంది వెళ్లేటప్పుడు బహుమతిగా వచ్చిన ఇక్కడి కుక్కలను తీసుకెళ్లి పెంచుకుంటున్నారు. స్తోమతను బట్టి కొందరు ఉచితంగా ఇస్తే, మరికొందరు అమ్ముతున్నారు. మరి కొందరు కేవలం ఖర్చులకు మాత్రమే తీసుకుంటున్నారు. తనతో పాటు ఎంతో మంది పోలీసు అధికారులకు పందికోన కుక్కలను ఇచ్చానని, తాను కూడా పెంచుకుంటున్నానని డి.ఎస్.పి వెంకట్రామయ్య అంటున్నారు. ప్రత్యేక ఆహారం అక్కరలేదు. సాధారణ తిండి మాత్రమే వీటికి అవసరం. వీటి పెంపకం సులభం. ఇప్పుడు దేశదేశాల్లో తమ తడాఖా చూపిస్తున్నాయి.
ఒక్క హైదరాబాదులోనే పందికోన జాతి కుక్కలు వందకు పైగా ఉన్నాయని గ్రామస్తులు అంటున్నారు. అడవులలో వేటకి వెళ్ళినప్పుడు పందికోన గ్రామం కుక్కల పౌరుషం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది . రియల్ గా ఉండే పౌరుషం ఆ సమయంలో బయట పడుతుంది. అమెరికాలో కుక్క లకు రన్నింగ్ నిర్వహించినప్పుడు పందికోన కుక్క గోల్డ్ మెడల్ సాధించిందంటే దాని పవరేంటో అర్థం చేసుకోవచ్చు.
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ లాంటి ఎందరో ప్రముఖులు కుక్కను తీసుకెళ్లి పెంచుకుంటున్నారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరులు కూడా ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి తీసుకెళ్లారు. ఇంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న పందికోన కుక్కల జాతిని విశ్వవ్యాప్తం చేస్తే బాగుంటుంది అనేది చాలా మంది అభిప్రాయం.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..