
ఒంగోలు నగరంలో శనివారం రాత్రి జరిగిన ఒక భారీ చోరీ తీవ్ర కలకలం రేపింది. మంగమూరు రోడ్డు ఆశ్రమం వెనుక భాగంలో నివాసం ఉంటున్న ప్రముఖ బంగారు వ్యాపారి అయినేని శ్రీనాథ్ గత నెల జూన్ 30వ తేదీన తన కుటుంబ సభ్యులతో కలిసి పాండిచ్చేరి విహారయాత్రకు వెళ్లారు. అయితే యాత్ర ముగించుకుని జూలై 4వ తేదీ శనివారం రాత్రి ఇంటికి చేరుకున్న శ్రీనాథ్ కుటుంబ సభ్యలుకు ఊహించని ట్విస్ట్ తగిలింది. వాళ్ల ఇంటి ప్రధాన ద్వారం తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గమనించిన శ్రీనాథ్, ఆందోళనతో లోపలికి వెళ్లి చూడగా.. ఇంట్లోని కప్‌బోర్డులు పూర్తిగా తెరిచి ఉండటంతో పాటు, అందులో దాచిన బంగారం, వెండి, నగదు మాయమైనట్లు గుర్తించి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
దీంతో వెంటనే ఒంగోలు తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే చోరీ జరిగిన ఇల్లు నగర శివారు ప్రాంతంలో ఉండటం వల్ల అక్కడ పోలీసు గస్తీ తక్కువగా ఉంటుందనే విషయాన్ని దొంగలు ముందే గమనించి చోరీకి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.. అంతేకాకుండా ఇంట్లోకి ప్రవేశించే గొంగలు ముందే బయట, లోపల ఉన్న సీసీ కెమెరాల వైర్లను కట్ చేశారు. క్లూస్ దొరకకుండా ఉండేందుకు సీసీ కెమెరాల ఫుటేజ్ రికార్డ్ అయ్యే కంప్యూటర్ స్టోరేజ్ డివైస్‌లను కూడా తమతో పాటు ఎత్తుకెళ్లారు. దీంతో ఈ భారీ చోరీ వెనుక ప్రొఫెషనల్ దొంగల హస్తం ఉన్నట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇతర సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఇటీవల ఒంగోలు నగరంలోని పలు ప్రాంతాల్లో వరుస చోరీలు జరుగుతుండటం, ఇప్పుడు ఏకంగా కోటిన్నర రూపాయల భారీ దోపిడీ జరగడంతో స్థానిక ప్రజలు దొంగల భయంతో వణికిపోతున్నారు. శివారు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేయాలని నగరవాసులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.