Andhra Rains: ఏపీపై అల్పపీడన తాండవం.. ఈ జిల్లాల్లో వరుణుడి దండయాత్ర

ఒడిశా తీరానికి ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రాబోయే రెండు రోజుల్లో బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆగస్టు 27న ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, తీరం వెంబడి గంటకు 40–60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

Andhra Rains: ఏపీపై అల్పపీడన తాండవం.. ఈ జిల్లాల్లో వరుణుడి దండయాత్ర
Andhra Rain Alert

Updated on: Aug 26, 2025 | 9:02 PM

ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాబోయే 2 రోజుల్లో పశ్చిమవాయువ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఆగస్టు 27, బుధవారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

రానున్న రెండు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.

బుధవారం(27-08-25):  అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.  శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

గురువారం(28-08-25):  కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.

మంగళవారం సాయంత్రం 6 గంటల నాటికి సాలపువానిపాలెంలో 60.2మిమీ, శ్రీకాకుళంలో 58మిమీ, విశాఖ జిల్లా నాతయ్యపాలెంలో 55.7మిమీ అనకాపల్లి జిల్లా గంధవరంలో 55.5మిమీ, లంకేలపాలెంలో 55.2మిమీ, విజయనగరం అర్బన్ 54.7మిమీ చొప్పున వర్షపాతం, 65 ప్రాంతాల్లో 40మిమీకు పైగా వర్షపాతం నమోదైందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..