ఎట్టకేలకు ఏపీకి తీపి కబురు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల్లో గంటకు 40-50 కి.మీ., గరిష్టంగా 60 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎట్టకేలకు ఏపీకి తీపి కబురు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
Andhra Pradesh Weather

Updated on: Sep 10, 2026 | 6:02 PM

ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం, శనివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

ఉత్తరకోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

శుక్రవారం వర్షాలు

శుక్రవారం (11-09-2026) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.

అలాగే పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

శనివారం కూడా వర్షాలు

శనివారం (12-09-2026) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

అనకాపల్లిలో భారీ వర్షపాతం

ఇదిలా ఉండగా.. గురువారం సాయంత్రం 5 గంటల వరకు అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. దార్లపూడిలో 37 మిల్లీమీటర్లు, నంగినారపాడు, వూడేరులో 34.5 మిల్లీమీటర్లు, పరవాడలో 34.2 మిల్లీమీటర్లు, గంధవరంలో 33.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us