తిరుపతి రుయా ఆస్పత్రిలో నయా మోసం.. డాక్టర్ వేషంలో వచ్చి నిలువునా దోచేశాడు..!

| Edited By: Balaraju Goud

Aug 09, 2024 | 1:24 PM

టెంపుల్ సిటీలో దొంగ అవతారాలు కొత్త ఎత్తులు వెతుకుతున్నారు. అన్ని వేషాలు వేస్తూ ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మాయగాడి మోసమే తిరుపతి రుయా ఆసుపత్రిలో వెలుగు చూసింది. నకిలీ డాక్టర్ నిర్వాకం బయటపడింది.

తిరుపతి రుయా ఆస్పత్రిలో నయా మోసం.. డాక్టర్ వేషంలో వచ్చి నిలువునా దోచేశాడు..!
Fake Doctor
Follow us on

టెంపుల్ సిటీలో దొంగ అవతారాలు కొత్త ఎత్తులు వెతుకుతున్నారు. అన్ని వేషాలు వేస్తూ ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మాయగాడి మోసమే తిరుపతి రుయా ఆసుపత్రిలో వెలుగు చూసింది. నకిలీ డాక్టర్ నిర్వాకం బయటపడింది. తెల్లకోటుతో వచ్చి టోకరా కొట్టిన నకిలీ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అసలు బండారం బయటపడింది.

సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం నరసంపల్లి తండాకు చెందిన 25 ఏళ్ల బానావత్ సాయికుమార్ నాయక్ భాగోతం వెలుగులోకి వచ్చింది. వైద్యుడి వేషధారణలో ఆసుపత్రిలోకి చొరబడ్డ సాయికుమార్ నాయక్ అనే యువకుడు దర్జాగా ఘరానా మోసానికి పాల్పడ్డాడు. సర్జికల్ వార్డులోకి తెల్ల కోటు, స్టెత్ వేసుకుని దర్జాగా వార్డులోకి ఎంట్రీ ఇచ్చాడు. రోగులను పలకరిస్తూ మందులు వేసుకున్నారా ఆరోగ్యం ఎలా ఉంది అంటూ పలకరించాడు. నకిలీ డాక్టర్‌గా నయా అవతారంలో రాణించిన సాయికుమార్ వార్డులో అడ్మిషన్ లో ఉన్న కీర్తిక అనే పేషెంట్‌ను స్కానింగ్‌కు రెఫర్ చేశాడు.

మదనపల్లి కి చెందిన అశోక్ 3 రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న తన కూతురు కీర్తికను తిరుపతి రూయా ఆస్పత్రిలో అడ్మిట్ చేశాడు. ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ సాయికుమార్‌ను పసిగట్ట లేకపోయాడు. పేషెంట్స్ ముందే స్కానింగ్ కోసం ఫోన్ చేసినట్లు బిల్డప్ ఇచ్చాడు. కీర్తిక అనే పేషెంట్ కు రిపోర్ట్ పంపమని ఎవరికో ఫోన్ చేసినట్టు నటించి నమ్మించాడు. స్కానింగ్ కోసం ఆధార్ కార్డు కావాలని పేషెంట్ తండ్రి అశోక్ కు చెప్పాడు. ఆధార్ కార్డు సెల్ ఫోన్ లో ఉందని చెప్పడంతో అశోక్ సెల్‌ఫోన్ తీసుకుని, పేషెంట్‌ను స్కానింగ్ సెంటర్‌కు తీసుకురమ్మని చెప్పి వెళ్ళిపోయాడు.

ఆధార్ జిరాక్స్ పేమెంట్ కోసం పిన్ కోడ్ తెలుసుకుని రూ. 40 వేలు కాజేశాడు. స్కానింగ్ సెంటర్ దగ్గరికి నకిలీ వైద్యుడు ఎంతసేపటికీ రాకపోవడం, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో మోసపోయినట్టు గుర్తించిన అశోక్ అక్కడే ఉన్న పోలీసు అవుట్ పోస్టులో ఫిర్యాదు చేశాడు. అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన తిరుపతి వెస్ట్ పీఎస్ పోలీసులు, వల పన్ని సాయికుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇదే తరహా రెండు సెల్ ఫోన్లు కూడా మాయమైనట్టు పోలీసులు గుర్తించారు. అసలు 100కు పైగా సీసీ కెమెరాలు నిఘాలో ఉన్న రుయా ఆసుపత్రిలో నకిలీ డాక్టర్ ఎంట్రీ, కొనసాగుతున్న దొంగతనాలు సెక్యూరిటీ డొల్లతనాన్ని బయట పెడుతోంది. రోగుల్లో ఆందోళనకు కారణమవుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..