
విజయవాడలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులకు ఊరట కల్పిస్తూ జాతీయ రహదారి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. గొల్లపూడి వైపు నుంచి వచ్చే వాహనాలకు ఇకపై విజయవాడ వెస్ట్ బైపాస్ ద్వారా నేరుగా చిన్న కాకాని హాయిలాండ్ వరకు వెళ్లడానికి అనుమతి లభించింది. ఈ కొత్త మార్గం ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం అవుతుంది. గొల్లపూడి పరిసర ప్రాంతాల నుంచి గుంటూరు హైవే వైపు వెళ్లే వాహనాలు ఇప్పటివరకు నగర ట్రాఫిక్‌లో చిక్కుకొనే పరిస్థితి ఉండేది. ముఖ్యంగా మందడం రోడ్డు, సచివాలయం, హైకోర్టు ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండేది. కొత్త మార్గం ప్రారంభంతో ఈ సమస్యకు ఉపశమనం దొరుకుతుందని అధికారులు భావిస్తున్నారు. నేషనల్ హైవే అధికారులు వివరించినట్లు, గొల్లపూడి నుంచి వచ్చే వాహనాలు కృష్ణా నదిపై ఉన్న వంతెన ద్వారా సీడ్‌యాక్సిస్ రోడ్ ఉపయోగించి విజయవాడ వెస్ట్ బైపాస్ ద్వారా నేరుగా చిన్న కాకాని హాయిలాండ్ చేరుకోవచ్చు. దీనితో ప్రయాణ సమయం తగ్గి.. ఖర్చు కూడా ఆదా అవుతుంది.
అయితే భద్రత కారణాలతో ప్రారంభ దశలో ఈ మార్గంపై కేవలం కార్లు, ద్విచక్రవాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వబడుతోంది. రోడ్డు పరిస్థితులు, ట్రాఫిక్ ప్రవాహాన్ని 10 రోజుల పాటు పరిశీలించిన తర్వాత భారీ వాహనాలపై నిర్ణయం తీసుకోవాలని అధికారులు తెలిపారు. ప్రణాళిక ప్రకారం ఫిబ్రవరి 20 తర్వాత లారీలు, ఇతర హెవీ వాహనాలకు కూడా అనుమతి ఇవ్వాలని నిర్ణయించనున్నారు. దీంతో నగరంలోకి వచ్చే భారీ వాహనాల రద్దీ తగ్గి ట్రాఫిక్ సమస్యలు మరింత తగ్గే అవకాశం ఉంది. విజయవాడ వెస్ట్ బైపాస్ ప్రాజెక్టు మొత్తం 17.6 కిలోమీటర్ల పొడవుతో నిర్మాణంలో ఉంది. గొల్లపూడి నుంచి చిన్న కాకాని వరకు ఆరు లైన్ల రహదారిగా తీర్చిదిద్దుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సుమారు రూ. 1194 కోట్ల నిధులు కేటాయించింది. కృష్ణా నదిపై నిర్మిస్తున్న భారీ వంతెనలు ఈ రహదారికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రాజెక్టును మార్చి 31, 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టారు. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఈ బైపాస్ చెన్నై-కొల్కతా నేషనల్ హైవేతో నేరుగా కలుస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.