మూడు వైపులా సముద్రం ఉండే భారతదేశ రక్షణలో అత్యంత కీలకం నావికాదళం. 1971 కరాచీ హార్బర్ పై జరిగిన దాడి.. పాక్ పై విజయోత్సవాలను గుర్తు చేసుకుంటూ ఏటా డిసెంబర్ 4వ తేదీన నేవీ డే వేడుకలు నిర్వహిస్తారు. ఏటా డిసెంబరు 2న ఫైనల్ రిహార్సల్స్, 4న నేవీ డే వేడుకలు విశాఖ సాగర తీరంలో జరుగుతాయి. అయితే ఈసారి తుఫాను నేపథ్యంలో వాటిని వాయిదా వేశారు. రెండో తేదీన జరగాల్సిన ఓపి డెమో ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ శుక్రవారం నాడు ఆర్కే బీచ్ లో జరిగాయి. ఫైనల్ రిహార్సల్స్‌లో నావికా దళ విన్యాసాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. బాంబుల శబ్దాలు, తుపాకీ మోతలతో విశాఖ తీరం దద్దరిల్లింది. భారత నావికా దళ శక్తి సామర్థ్యాలు తెలియజేసే విధంగా.. మైరెన్ కమాండోలు ఉగ్రవాదులపై దాడులు, స్కై డైవింగ్, హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, విమానాలతో బాంబు దాడులు, రెస్క్యూ ఆపరేషన్ విన్యాసాలు ప్రదర్శనలతో అందరిని అబ్బుర పరిచారు. ఒకేసారి 20 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఆకాశమే హద్దుగా సత్తా చాటుతుంటే.. మరోవైపు 10 యుద్ధనౌకలు సముద్రంలో మేము సైతం అంటూ ప్రదర్శన చేశాయి.
రణ్ విజయ్, శివాలిక్, ఢిల్లీ, కమోర్త యుద్ధ నౌకలతో పాటు ఐఎన్ఎస్ సింధు శస్త్ర సబ్ మెరైన్‌లు తమ సత్తా చాటాయి. హాక్, డార్నియర్, పి8ఐ యుద్ధ విమానాలు, అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్, యుహెచ్3హెచ్ హెలికాప్టర్లు ఒళ్ళు గగుర్పొడిచే విన్యాసాలు చేశాయి. శత్రువులపై దాడులే కాదు.. ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలు, సముద్రంలో మునిగిపోతున్న వారిని రక్షించే నావికాదళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నేవీ బ్యాండ్ ప్రదర్శన, విజయానికి చిహ్నంగా ప్రత్యేకంగా సముద్రంలో యుద్ధ నౌకలను విద్యుత్ దీపాలతో అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆదివారం జరిగే తుది వేడుకలకు ముఖ్య అతిధిగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరు కానున్నారు. అదే రోజు తూర్పు నావికాదళాధిపతి రాజేష్ పెంధార్కర్ నేవీ హౌస్‌లో ఏర్పాటు చేసే ఎట్ హోమ్ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొంటారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..