AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandigama Politics: మున్నేరులో ముగ్గురు యువకుల మృతి.. అధికార, విపక్షాల మధ్య పేలుతున్న మాటల తూటాలు

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఇసుక తుఫాన్‌ దుమారం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత తంగిరాల సౌమ్య వర్సెస్‌ వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్‌ కుమార్‌ అన్నట్లు ఈ మాటల తుఫాన్‌ చెలరేగుతోంది. కీసర దగ్గర మున్నేరులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. ఆ సంఘటన రాజకీయ రచ్చకు దారితీసింది.

Nandigama Politics: మున్నేరులో ముగ్గురు యువకుల మృతి.. అధికార, విపక్షాల మధ్య పేలుతున్న మాటల తూటాలు
Tangirala Sowmya, Arun Kumar
Balaraju Goud
|

Updated on: Nov 14, 2023 | 12:07 PM

Share

నందిగామలో ఇసుక తుఫాన్‌ రేగుతోంది. ముగ్గురు యువకుల మృతి చుట్టూ ఇసుక రాజకీయం తిరుగుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రేపుతోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఇసుక తుఫాన్‌ దుమారం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత తంగిరాల సౌమ్య వర్సెస్‌ వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్‌ కుమార్‌ అన్నట్లు ఈ మాటల తుఫాన్‌ చెలరేగుతోంది. కీసర దగ్గర మున్నేరులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. ఆ సంఘటన రాజకీయ రచ్చకు దారితీసింది.

వైసీపీ నేతల ఇసుక అక్రమ రవాణా వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందంటూ సౌమ్య ఘాటు కామెంట్లు చేశారు. అధికార పార్టీ నేతల అక్రమ దందా కారణంగానే ముగ్గురు యువకులు మృతి చెందారని ఆమె ఆరోపించారు. ఇసుక ఎక్కువగా తోడెయ్యడంతో గుంతలు పడి ఈ విషాద ఘటన జరిగిందని సౌమ్య ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవట్లేదని ఆరోపణలు చేశారు ఆమె. సౌమ్య వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ అరుణ్‌ కుమార్‌ కౌంటర్‌ ఇచ్చారు. సౌమ్య చెప్పినట్లు అక్కడ ఎటువంటి ఇసుక తవ్వకాలు జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు. కంచలలో అధికారిక రీచ్ ఉందని, అక్కడ నుంచే ఇసుక రవాణా జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు అరుణ్‌ కుమార్‌. అవగాహన లేని వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తారంటూ సౌమ్యకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ. తమపై ఆరోపణలు చేయడమే ప్రధాన వృత్తి గా పెట్టుకున్నారంటూ సౌమ్యపై మండిపడ్డారు ఆయన.

మరోవైపు 2005లో దేవినేని ఉమ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇసుక అక్రమ రవాణా జరిగి 11 మంది మరణించారంటూ ఎమ్మెల్సీ అరుణ్ గుర్తు చేశారు. తాజాగా ముగ్గురు యువకులు చనిపోయిన చోట ఎటువంటి అక్రమ ఇసుక తవ్వకాలు జరగలేదన్నారు అరుణ్ కుమార్. కీసరలో అక్రమ తవ్వకాల వల్ల యువకులు చనిపోయారని మాజీ ఎమ్మెల్యే నిరూపించాలన్నారు ఎమ్మెల్సీ. ఇలాంటి సంఘటనలను రాజకీయాలకు వాడుకోవడం మంచి పద్దతి కాదంటూ హితవు పలికారు అరుణ్‌ కుమార్‌. ఎమ్మెల్యే జగన్ మోహన్ రావును హేళన చేయడం కరెక్ట్ కాదని ఆయన స్వతహాగా డాక్టర్ కాబట్టి కాపాడే ప్రయత్నం చేశారని ఎమ్మెల్సీ వివరించారు. అధికార, ప్రతిపక్షాల మధ్య నందిగామలో చెలరేగుతున్న ఇసుక తుఫాన్‌ రాజకీయం ఎటు దారితీస్తుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…