Naga sadhu in Anakapalle: ఒళ్లంతా బుడిద.. దిగంబరం.. అనుక్షణం ఆధ్యాత్మిక చింతనతో అర్థ నగ్నంగా ఉంటారు.. వాళ్ల శైలి, జీవన విధానం ప్రత్యేకం.. నిత్యం శివ జపంలోనే ఉంటూ.. పూజలు చేస్తూ ఉంటారు. కుంభమేళాలో మహా కుంభమేళలో ఎక్కువగా దర్శనమిస్తుంటారు. సాధారణ సమయంలో సామాన్యులకు కనిపించడం కూడా చాలా అరుదు.. వారు ఎవరో కాదు నాగసాధువులు.. అయితే, ఓ నాగసాధువు ఏపీలో ఒక్కసారిగా దర్శనమివ్వడంతో.. ఆయన ఆశీస్సుల కోసం జనం క్యూ కట్టారు. అనకాపల్లి జిల్లాలో నాగ సాధువు ప్రత్యక్షమయ్యారు. హోమంలో పాల్గొని పూజ చేశారు. లోక కళ్యాణం కోసమే తన జీవితం అంకితం అని నాగ సాధువు పేర్కొన్నారు. అనకాపల్లిలో సోహం ఆశ్రమంలో గత కొన్ని రోజులుగా మహా మృత్యుంజయ హోమం జరుగుతుంది. జూలై 14న ప్రారంభమైన ఈ హోమం అక్టోబర్ 11తో ముగుస్తుంది. అయితే కాశీ నుండి శ్రీశైలం వెళ్తున్న ఓ నాగ సాధువు.. మృత్యుంజయ హోమం జరుగుతున్నట్టు తెలుసుకొని అక్కడకు వెళ్లారు. హోమ గుండాన్ని తొలగించి.. తమదైన శైలిలో పూజ చేశారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల లోక కళ్యాణం కలుగుతుందని ఆ నాగ సాధువు వివరించారు. లోక కళ్యాణం కోసమే తమలాంటి నాగసాధువుల జీవితం అంకితమని తెలిపారు. జడలు కట్టిన జుట్టుతో దిగంబరుడుగా ఉన్న నాగ సాధువు ఆశీస్సులు పొందెందుకు జనం క్యూ కట్టారు.
నాగ సాధువులు జీవితం ప్రత్యేకంగా ఉంటుంది. శ్మశాన బూడిదను మాత్రమే ఒంటికి పట్టించుకుంటారు. ఇలా బూడిదను రాసుకున్నవాళ్లు అన్ని బంధాల నుంచి విముక్తి అవుతారు. వాంఛలకు దూరంగా.. వైరాగ్య పంథాలో పయనిస్తున్నామని తెలపడం కోసం ఇలా దిగంబరంగా తిరుగుతుంటారట. దేశాన్ని, ధర్మాన్ని కాపాడే సైన్యంగా జగద్గురు ఆదిశంకరాచార్యులు ఈ నాగ సాధువులను తయారు చేశారని పేర్కొంటుంటారు. అఖారాలలో నివసించే నాగ సాధువులు.. సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ.. కుంభమేళాల్లో దర్శనమిస్తూ ఉంటారు.
అలాంటి నాగసాధువు అనకాపల్లిలో దర్శనమివ్వడంతో చాలామంది భక్తులు అతన్ని చూడటానికి మృత్యుంజయ హోమం జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. కొందరు ఆయన ఆశిస్సులు తీసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..